David Warner(courtesy- IPL/BCCI)- Gautam Gambhir
Gautam Gambhir Comments On David Warner: ఐపీఎల్-2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం మూడే మ్యాచ్‌లు గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్.. శుక్రవారం తమ చివరి మ్యాచ్ ఆడబోతోంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడబోతోంది. ఇందులో గెలిస్తే.. ముంబై ప్లే ఆఫ్స్(సాంకేతికపరమైన అవకాశాలు) ఆశలకు గండికొట్టి.. పరువు నిలుపుకోవడమే తప్ప పెద్దగా సాధించేదేమీ లేదు.
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. వచ్చే సీజన్‌లో ఎలాగో వార్నర్ ఆరెంజ్ ఆర్మీలో ఉండడనే సంకేతాలు ఉన్నాయి.. కాబట్టి.. ఒకప్పటి(2016) టైటిల్ విన్నింగ్ కెప్టెన్‌ను చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వాలని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గెలవడానికి మ్యాచ్‌లు ఆడాలే తప్ప వ్యక్తులకు ఫేర్‌వెల్ ఇవ్వడానికి కాదంటూ ఘాటుగా విమర్శించాడు.
ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో చాట్‌లో గంభీర్ మాట్లాడుతూ... ‘‘చాలా మంది గొప్ప గొప్ప ఆటగాళ్లకే వీడ్కోలు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. మనందరికీ తెలుసు... కొంతమంది లెజెండ్స్‌కు కూడా ఈ ఛాన్స్ మిస్సయింది. అసలు ‘ఫేర్‌వెల్ మ్యాచ్’ల వ్యవస్థ ఏమిటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఎవరైనా గెలుపే అంతిమ లక్ష్యంగా మ్యాచ్ ఆడతారు. తుదిజట్టులో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్లలో అతడూ ఒకడైతే కచ్చితంగా ఆడతాడు. అంతేగానీ.. అతడికి తుదిజట్టులో చోటు ఇవ్వాలనే నిబంధనేం లేదు కదా. కాబట్టి.. సన్‌రైజర్స్ మ్యాచ్ గెలవాలి.. కానీ ఫేర్‌వెల్ ఇవ్వడానికి పరిమితం కాకూడదు’’ అని వార్నర్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు.
ఇక తుదిజట్టు ఎంపిక గురించి తన అభిప్రాయం పంచుకుంటూ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన జట్టుతోనే ముందుకు వెళ్తే బాగుంటుందని సూచించాడు. ‘‘ఆర్సీబీ మాదిరే ముంబైపై కూడా అదే జట్టుతో ఆడవచ్చు. భువీ(భువనేశ్వర్ కుమార్) గత మ్యాచ్‌లో మెరుగ్గా రాణించాడు. అతడికి ఉమ్రాన్ మాలిక్ కూడా తోడయ్యాడు. రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆర్సీబీపై గెలవలేరు అనుకున్న మ్యాచ్‌లో వారు గెలిచి చూపించారు. ముంబై విషయంలోనూ అదే తరహాలో ముందుకు సాగాలి’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Deepak Chahar: చహర్ ప్రేమాయణం.. భాభీ దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?!
Comments
Please login to add a commentAdd a comment