సురేశ్ రైనా ఘనత
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటికి పదేళ్లు పూర్తయింది. 20 ఏళ్ల వయసులో తొలి వన్డే ఆడాడు. 2005, జూలై 30న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించడం పట్ల రైనా సంతోషం వ్యక్తం చేశాడు.
'అంతర్జాతీయ క్రికెట్ లో పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఇంత గొప్ప ప్రయాణానికి సహకరించిన నా కుటుంబానికి, బీసీసీఐకి, సెలెక్టర్లకు, సహచరులకు, స్నేహితులకు, అభిమానులకు థ్యాంక్స్. నా కెరీర్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నా. మరింతగా రాణించి దేశ ప్రతిష్ఠను పెంచుతా' అని రైనా పేర్కొన్నాడు.
ఇప్పటివరకు 218 వన్డేలు ఆడిన రైనా 93.80 స్టైక్ రేటుతో 5500 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. 18 టెస్టులు, 44 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడాడు. మూడు ఫార్మెట్లలోనూ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్ మన్ గా ఘనత సాధించిన రైనా 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లోనూ సభ్యుడుగా ఉన్నాడు.