
టి20లోనూ కివీస్ క్లీన్‌స్వీప్
అండర్సన్ మెరుపు ఇన్నింగ్స్ ∙41 బంతుల్లో 94 నాటౌట్
మూడో మ్యాచ్‌లోనూ బంగ్లా ఓటమి
మౌంట్ మాంగనూ (న్యూజిలాండ్): బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను కూడా న్యూజిలాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20లో కోరె అండర్సన్ విధ్వంసకర ఆటతీరుతో 41 బంతుల్లోనే అజేయంగా 94 పరుగులు (2 ఫోర్లు, 10 సిక్సర్లు) చేయడంతో కివీస్ 27 పరుగుల తేడాతో నెగ్గింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకున్న కివీస్ ఈనెల 12 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ కేన్ విలియమ్సన్ (57 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. 41 పరుగులకు మూడు వికెట్లు పడిన దశలో అండర్సన్, విలియమ్సన్ జోడి బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించారు.
ముఖ్యంగా అండర్సన్ మోర్తజా బౌలింగ్‌లో 4,6,6తో పాటు సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. నాలుగో వికెట్‌కు వీరి మధ్య 124 పరుగులు జత చేరాయి. తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 79 పరుగులతో ఉన్న అండర్సన్ రెండు సిక్సర్లు బాది కెరీర్‌లో తొలి శతకానికి మరో ఆరు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అలాగే కివీస్ తరపున టి20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రూబెల్ హŸస్సేన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 42; 6 ఫోర్లు), షకీబ్ (34 బంతుల్లో 41; 4 ఫోర్లు) మాత్రమే ఆడగలిగారు. బౌల్ట్, సోధిలకు రెండేసి వికెట్లు దక్కాయి.