టి20 కబుర్లు... | T20 discussions | Sakshi
Sakshi News home page

టి20 కబుర్లు...

Published Thu, Apr 3 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

T20  discussions

 ఎవరైనా గెలవొచ్చు!
 టి20ల్లో ఫామ్ ముఖ్యం కాదు
 భారత్‌తో సెమీస్‌పై ఆమ్లా వ్యాఖ్య
 
 ( ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
 భారత్ జట్టు ఫామ్‌లో ఉందా లేదా అనే విషయానికి ప్రాధాన్యత లేదని, టి20ల్లో ఫామ్ ఏ మాత్రం ముఖ్యం కాదని దక్షిణాఫ్రికా ఓపెనర్ ఆమ్లా అన్నాడు. రెండు పటిష్టమైన జట్ల మధ్య సెమీస్‌లో ఎవరైనా గెలవొచ్చని వ్యాఖ్యానించాడు. బుధవారం ఉదయం దక్షిణాఫ్రికా జట్టు ప్రాక్టీస్ తర్వాత ఆమ్లా మీడియాతో మాట్లాడాడు. ‘వరుసగా రెండు మూడు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు ఆడటం వల్ల మా జట్టు మంచి జోరులో ఉంది.
 
 
  సెమీస్‌కు ముందు విశ్రాంతి దొరకడం వల్ల మళ్లీ తాజాగా మ్యాచ్‌కు సిద్ధమయ్యే అవకాశం లభించింది. చిట్టగాంగ్‌తో పోలిస్తే ఇక్కడ వికెట్ కాస్త భిన్నంగా కనిపిస్తోంది’ అని ఆమ్లా చెప్పాడు. వ్యక్తిగతంగా తన ఆటతీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నానని అన్నాడు. ‘టి20ల్లో వేగంగా ఆడటం ఎంత ముఖ్యమో, రెండో ఎండ్‌లో ఆటగాడికి తగ్గట్లుగా మన ఆటను మార్చుకోవడం కూడా అంతే ముఖ్యం. నేను పరిస్థితిని బట్టే ఆడతా. ప్రస్తుతం నా ఫామ్ పట్ల సంతృప్తిగా ఉన్నా’ అని ఆమ్లా చెప్పాడు.
 
 ప్రాక్టీస్‌కు యువీ దూరం
 భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్‌కు ఎడమ కాలి చీలమండ దగ్గర చిన్న గాయం అయింది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లోనే ఇబ్బంది పడ్డ యువీ... బుధవారం ఫతుల్లాలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు రాలేదు. అయితే యువీ గాయం తీవ్రమైందేమీ కాదని... ముందు జాగ్రత్త కోసమే విశ్రాంతి ఇచ్చామని భారత జట్టు తెలిపింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగే సెమీస్‌కు యువీ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే అంశంపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
 
 దక్షిణాఫ్రికాకు ‘వార్న్’ సలహాలు
 టి20 ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా పని చేస్తున్న షేన్ వార్న్ బుధవారం స్పిన్ కోచ్‌గా మారిపోయాడు. దక్షిణాఫ్రికా నెట్ సెషన్‌కు వచ్చి సుమారు గంటసేపు ఆ జట్టు బౌలర్లకు స్పిన్‌లో మెళకువలు నేర్పాడు. లెగ్‌స్పిన్నర్ తాహిర్‌తో చాలాసేపు మాట్లాడాడు. డుమిని బౌలింగ్‌ను గమనించాడు. డి కాక్‌కు కొద్దిసేపు బౌలింగ్ చేశాడు. తర్వాత దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్ డొనాల్డ్‌తోనూ కాసేపు ముచ్చటించాడు. మొత్తానికి దక్షిణాఫ్రికా సెషన్‌కు వార్న్ హైలైట్‌గా నిలిచాడు.  దక్షిణాఫ్రికా జట్టు మేనేజ్‌మెంట్ కోరిక మేరక వార్న్ వస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ సఫారీలు మాత్రం తాము పిలువలేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement