భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుంది | Taufel Says No Indian in ICCs Elite Panel of Umpires | Sakshi
Sakshi News home page

భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుంది

Published Tue, Nov 26 2019 11:06 PM | Last Updated on Tue, Nov 26 2019 11:06 PM

Taufel Says No Indian in ICCs Elite Panel of Umpires - Sakshi

మాజీ అంపైర్‌ సైమన్‌ టౌఫెల్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఎలైట్‌ ప్యానల్‌లో చేరేందుకు భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుందని రిటైర్డ్‌ అంపైర్‌ సైమన్‌ టౌఫెల్‌ అన్నాడు. మంగళవారం ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ విషయం పేర్కొన్నాడు. ‘ప్రపంచ స్థాయి అంపైర్‌ కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. మేం భారత్‌లో ఈ కార్యక్రమాన్ని 2006లో మొదలుపెట్టి 2016లో ముగించాం. ఎలైట్‌ ప్యానల్‌లో అడుగుపెట్టడానికి భారత్‌ నుంచి అంపైర్‌ ఎస్‌.రవికి కనీసం పదేళ్లు పట్టింది. అందుకే బీసీసీఐ ఈ విషయంపై పునరాలోచించాలి. భారత్‌కు అంపైర్లు అవసరం. దేశవాళీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటున్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఈ విషయంపైనా దృష్టి పెట్టాలి. అంపైర్లు ఎదిగే వాతావరణాన్ని సృష్టించాలి. అంపైర్ల కోసం ప్రత్యేకంగా మేనేజర్లు, కోచ్‌లు, ట్రైనర్లను నియమించాలి’అని పేర్కొన్నాడు. 

కాగా భారత్‌ నుంచి ఎలైట్‌ ప్యానల్‌లో 2015లో చోటు దక్కించుకున్న రవి విధుల్లో పదే తప్పులు చేస్తుండడంతో ఈ ఏడాది మొదట్లో తొలగించారు. రవి యాషెస్‌ సహా 33 టెస్ట్‌లు, 48 వన్డేలు, 18 టీ20లకు అంపైర్‌ బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు 15 ఏళ్ల క్రితం భారత అంపైర్ ఎస్.వెంకట్రాఘవన్ ఒక్కరే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ చోటు దక్కించుకోగా.. ఆ తరువాత ఎస్ రవి ఆ అరుదైన గౌరవాన్ని వరుసగా రెండోసారి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక 2004 నుంచి 2008 వరకు నంబర్‌ వన్‌ అంపైర్‌గా కొనసాగిన ఈ 48 ఆస్ట్రేలియన్‌ 2012లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అనంతరం అక్టోబర్‌ 2015 వరకు ఐసీసీ అంపైర్‌ పెర్ఫార్మెన్స్‌ అండ్‌ ట్రైనింగ్‌ మేనేజర్‌గా సేవలందించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement