Simon Taufel
-
భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎలైట్ ప్యానల్లో చేరేందుకు భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుందని రిటైర్డ్ అంపైర్ సైమన్ టౌఫెల్ అన్నాడు. మంగళవారం ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ విషయం పేర్కొన్నాడు. ‘ప్రపంచ స్థాయి అంపైర్ కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. మేం భారత్‌లో ఈ కార్యక్రమాన్ని 2006లో మొదలుపెట్టి 2016లో ముగించాం. ఎలైట్ ప్యానల్లో అడుగుపెట్టడానికి భారత్ నుంచి అంపైర్ ఎస్.రవికి కనీసం పదేళ్లు పట్టింది. అందుకే బీసీసీఐ ఈ విషయంపై పునరాలోచించాలి. భారత్‌కు అంపైర్లు అవసరం. దేశవాళీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటున్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఈ విషయంపైనా దృష్టి పెట్టాలి. అంపైర్లు ఎదిగే వాతావరణాన్ని సృష్టించాలి. అంపైర్ల కోసం ప్రత్యేకంగా మేనేజర్లు, కోచ్‌లు, ట్రైనర్లను నియమించాలి’అని పేర్కొన్నాడు. కాగా భారత్ నుంచి ఎలైట్ ప్యానల్లో 2015లో చోటు దక్కించుకున్న రవి విధుల్లో పదే తప్పులు చేస్తుండడంతో ఈ ఏడాది మొదట్లో తొలగించారు. రవి యాషెస్ సహా 33 టెస్ట్‌లు, 48 వన్డేలు, 18 టీ20లకు అంపైర్ బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు 15 ఏళ్ల క్రితం భారత అంపైర్ ఎస్.వెంకట్రాఘవన్ ఒక్కరే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ చోటు దక్కించుకోగా.. ఆ తరువాత ఎస్ రవి ఆ అరుదైన గౌరవాన్ని వరుసగా రెండోసారి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక 2004 నుంచి 2008 వరకు నంబర్ వన్ అంపైర్‌గా కొనసాగిన ఈ 48 ఆస్ట్రేలియన్ 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం అక్టోబర్ 2015 వరకు ఐసీసీ అంపైర్ పెర్ఫార్మెన్స్ అండ్ ట్రైనింగ్ మేనేజర్‌గా సేవలందించాడు. -
అశ్విన్ చేసింది కరెక్టే.. ధోనిది మాత్రం తప్పు!
సిడ్నీ: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎక్కువ చర్చనీయాంశమైన అంశాల్లో ఒకటి కింగ్స్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ చేసిన మన్కడింగ్ కాగా, రెండోది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగడం. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఇది క్రికెట్ అభిమానుల మదిలో ఉండగానే నో బాల్ విషయంలో డగౌట్ నుంచి మరీ ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో ధోని వాదించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ కూల్‌గా ఉండే అంపైర్లతో వాదనకు దిగడం క్రికెట్ మేధావుల నోటికి పని చెప్పింది. అయితే నిబంధలన ప్రకారం ఏది కరెక్ట్.. ఏది కరెక్ట్ కాదు అనే విషయంపై ఐసీసీ కౌన్సిల్ మాజీ అంపైర్ సైమన్ టఫెల్ వివరణ ఇచ్చాడు. ఇక్కడ అశ్విన్ చేసిన పనికి టఫెల్ నుంచి మద్దతు రాగా, ధోని విషయంలో మాత్రం పెదవి విరిచాడు. ‘ నో బాల్ విషయంలో అంపైర్లే నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఫీల్డ్ అంపైర్లు ముందుగా నో బాల్ అని ప్రకటించారు. తర్వాత నో బాల్ కాదని తెలుసుకుని సరి చేసుకున్నారు. అటువంటి సమయంలో ధోని ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదం చేయడం సరికాదు. అది నిబంధనలకు విరుద్ధం. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్లో ఉన్న ప్లేయర్ గానీ, కోచ్ గానీ, మేనేజర్స్ గానీ ఫీల్డ్‌లోకి వెళ్లకూడదు. ఫీల్డ్‌లోకి ధోని వచ్చినప్పుడు అతన్ని అంపైర్లు ఎంటర్టైన్ చేయాల్సిన పనిలేదు. అక్కడ్నుంచి వెంటనే పంపించేయాలి. ఇందులో రెండో ప్రశ్నే లేదు. అసలు ధోనితో అంతసేపు చర్చించడమే అనవసరం’ అని టఫెల్ చెప్పుకొచ్చాడు. ఇక అశ్విన్ మన్కడింగ్ విషయాన్ని మాత్రం ఈ దిగ్గజ అంపైర్ సమర్ధించాడు. అశ్విన్ చేసిన దాంట్లో ఎంతమాత్రం తప్పు లేదన్నాడు. దీనికి క్రీడా స్ఫూర్తి అనే ట్యాగ్ తగిలిచడం సరికాదన్నాడు. ‘ అశ్విన్ చేసింది నూటికి నూరుపాళ్లు సరైనదే. క్రికెట్ లా మేకర్ మెర్లిన్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిబంధనల ప్రకారం అశ్విన్ చేసింది కరెక్టే. ఎంసీసీ చట్టంలోని 41.16 నిబంధన ప్రకారం నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని బ్యాట్స్‌మన్ బౌలర్ బంతిని వేసే వరకూ క్రీజ్ విడిచి వెళ్లకూడదు. అయితే ఇలా రనౌట్ చేయడానికి ముందు నాన్ స్టైకర్ బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాలనడం మనం పెట్టుకున్నదే కానీ నిబంధనల్లో ఎక్కడా లేదు’ అని స్పష్టం చేశాడు. -
టౌఫెల్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్
ముంబై: ఐపీఎల్-8 మ్యాచ్ అఫీషియల్స్ కోసం రెండు రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్ ఆధ్వర్యంలో నేడు (శనివారం), రేపు ఈ సమావేశం జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. ఇందులో అంపైర్లు, రిఫరీలు కలిసి 26 మంది పాల్గొంటారని పేర్కొంది. దీంట్లో దుస్తుల నియంత్రణ, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనతో పాటు ఓవరాల్గామ్యాచ్లను నిర్వహించే విధానంపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఐసీసీ అంపైర్ పనితీరు మరియు శిక్షణ అధికారిగా వ్యవహరిస్తున్న టౌఫెల్.. ప్రారంభ లీగ్ మ్యాచ్‌ల్లో అఫీషియల్స్ బృందంతో పాటు పర్యటించనున్నారు.