
'మహి' మాన్వితం....
రెండో వన్డేలో భారత్ విజయం
ధోని అద్భుత బ్యాటింగ్
సమష్టిగా రాణించిన బౌలర్లు
మూడో వన్డే ఆదివారం
చాలామంది దృష్టిలో జట్టుకు భారంగా కనిపించిన మనిషి ఇప్పుడు బాహుబలిలా ఒక్కడే జట్టు బరువు మోశాడు. ఫినిషింగ్ టచ్ పోయిందంటూ వస్తున్న విమర్శలకు ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాడు. ఇలా ఆడటం కొత్త కాదు... కాకపోతే ఇప్పుడు మరోసారి చేసి చూపించాడు. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తన కత్తికి రెండు వైపులా ఉన్న పదును ధోని మరోసారి ప్రదర్శించాడు.
కెప్టెన్ ఎంతగా ఒంటరి పోరాటం చేసినా దక్షిణాఫ్రికాలాంటి ప్రత్యర్థిపై 247 పరుగులను కాపాడుకోవడం చాలా కష్టం. ఇక్కడే ధోని తన కెప్టెన్సీ మహిమనూ చూపించాడు. సారథి కష్టాన్ని కళ్లారా చూసి స్ఫూర్తి పొందిన సహచరులూ స్పందించారు. బౌలర్లంతా చెమటోడ్చారు. వెరసి... వన్డే సిరీస్‌లో భారత్ బోణీ చేసింది. వరుస ఓటముల ఒత్తిడి నుంచి బయటకు వచ్చి సాంత్వన పొందింది.
ఇండోర్: లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 9వ వికెట్ పడింది... గతంలో ఇలాంటి ఎన్నో సందర్భాలను అసలు పట్టించుకోని ధోని కూడా తాహిర్ క్యాచ్ అందుకున్నాక కొత్త కుర్రాడిలా గంతులు వేశాడు. ఆ సమయంలో అతనిలో ఎంతో భావోద్వేగం కనిపించింది. ‘ఇది నా మ్యాచ్...చూశారా’ అనే ఆనందాన్ని ప్రదర్శించాడు. ఇక సఫారీలు ఆలౌట్ కాగానే మైదానంలో ఆటగాళ్లతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో కౌగిలింతలు, సంబరాలు... ఈ దృశ్యాలు చూస్తే తెలుస్తుంది... విజయం భారత జట్టుకు ఎంత అవసరమో! ఈ గెలుపు వారికి కావాల్సిన ఉత్సాహాన్ని ఎలా ఇచ్చిందో! బుధవారం హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోని (86 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు అజింక్య రహానే (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 43.4 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. డు ప్లెసిస్ (56 బంతుల్లో 51; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అక్షర్, భువనేశ్వర్ చెరో 3 వికెట్లు తీశాడు. ఐదు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. మూడో వన్డే ఆదివారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. రోహిత్ విఫలం: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ను రబడ తన తొలి ఓవర్లోనే దెబ్బతీశాడు. ఫామ్‌లో ఉన్న రోహిత్ (3)ను అవుట్ చేశాడు. రహానే దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా... మరో వైపు కుదురుకున్నట్లు కనిపించిన ధావన్ (34 బంతుల్లో 23; 4 ఫోర్లు) షార్ట్ కవర్‌లో సునాయాస క్యాచ్‌తో వెనుదిరిగాడు.
తడబడుతూ ఆడిన కోహ్లి, రహానేతో సమన్వయ లోపంతో అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. 59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం తాహిర్ అద్భుత బంతికి రహానే బౌల్డయ్యాడు. రైనా (0), అక్షర్ (13) విఫలమవడంతో భారత్ 29.3 ఓవర్లలో 124 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ధోని సూపర్: ఈ దశలో ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన బాధ్యత ధోని తీసుకున్నాడు. చకచకా సింగిల్స్‌తో పాటు పుల్, కట్, లాఫ్టెడ్ షాట్... ఇలా అన్నింటినీ అతను ప్రదర్శించాడు. డుమిని బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 57 బంతుల్లో ధోని హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భువనేశ్వర్ (14), హర్భజన్ (22 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్‌కు సహకరించారు.
దోని చలువతో భారత్ చివరి 10 ఓవర్లలో 82 పరుగులు చేయగలిగింది. డు ప్లెసిస్ మినహా: ఆమ్లా (17), డి కాక్ (34) ధాటిగా ఆడినా తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. డు ప్లెసిస్, డుమిని (46 బంతుల్లో 36; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం ఒక్కసారిగా పరిస్థితి భారత్‌కు అనుకూలంగా మారింది. అక్షర్ బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి డుమిని ఎల్బీ కాగా, అక్షర్ మరుసటి ఓవర్లో ప్లెసిస్ అవుటయ్యాడు. భువీ వేసిన తర్వాతి బంతికే మిల్లర్ (0) అవుటైనా... డివిలియర్స్ (19) క్రీజ్‌లో ఉండటంతో దక్షిణాఫ్రికా ధీమాగానే ఉంది. కానీ మోహిత్ బౌలింగ్‌లో అతను వెనుదిరగడంతో సఫారీల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. చివర్లో బెహర్దీన్ (18), రబడ (19 నాటౌట్) పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
20 ధోని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ల సంఖ్య. కోహ్లి (20)తో సమం. కెప్టెన్‌గా ఇది 15వది. జట్టు గెలిచిన మ్యాచ్‌లలో ఎక్కువ సార్లు (54) నాటౌట్‌గా నిలిచిన ఘనత కూడా ధోనిదే. బెవాన్ (53)ను అధిగమించాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) రబడ 3; ధావన్ (సి) డుమిని (బి) మోర్కెల్ 23; రహానే (బి) తాహిర్ 51; కోహ్లి (రనౌట్) 12; ధోని (నాటౌట్) 92; రైనా (సి) డి కాక్ (బి) మోర్కెల్ 0; అక్షర్ (ఎల్బీ) (బి) స్టెయిన్ 13; భువనేశ్వర్ (బి) తాహిర్ 14; హర్భజన్ (సి) డి కాక్ (బి) స్టెయిన్ 22; ఉమేశ్ (సి) డి కాక్ (బి) స్టెయిన్ 4; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1-3; 2-59; 3-82; 4-102; 5-104; 6-124; 7-165; 8-221; 9-225.
బౌలింగ్: స్టెయిన్ 10-0-49-3; రబడ 10-1-49-1; మోర్కెల్ 10-0-42-2; డుమిని 9-0-59-0; తాహిర్ 10-1-42-2; బెహర్దీన్ 1-0-4-0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (స్టంప్డ్) ధోని (బి) అక్షర్ 17; డి కాక్ (సి) మోహిత్ (బి) హర్భజన్ 34; డు ప్లెసిస్ (సి) కోహ్లి (బి) అక్షర్ 51; డుమిని (ఎల్బీ) (బి) అక్షర్ 36; డివిలియర్స్ (సి) కోహ్లి (బి) మోహిత్ 19; మిల్లర్ (సి) ధోని (బి) 0; బెహర్దీన్ (సి) ధోని (బి) హర్భజన్ 18; స్టెయిన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 13; రబడ (నాటౌట్) 19; తాహిర్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 9; మోర్కెల్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (43.4 ఓవర్లలో ఆలౌట్) 225.
వికెట్ల పతనం: 1-40; 2-52; 3-134; 4-141; 5-142; 6-167; 7-186; 8-200; 9-221; 10-225.
బౌలింగ్: భువనేశ్వర్ 8.4-0-41-3; ఉమేశ్ 8-0-52-1; హర్భజన్ 10-0-51-2; అక్షర్ 10-0-39-3; మోహిత్ 5-0-21-1; రైనా 2-0-18-0.