
టీమిండియా తడబాటు
మొహాలి:నాలుగు టెస్టు సిరీస్ లో భాగంగా ఇక్కడ దక్షిణాఫ్రికాతో గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధవన్ పరుగులేమీ చేయకుండానే ఫిలిండర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. అనంతరం ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను మరో ఓపెనర్ మురళీ విజయ్, చటేశ్వర పూజారాలు తీసుకున్నారు. కాగా, పూజారా(31) రెండో వికెట్ గా అవుట్ అయ్యాడు.
అటు తరువాత రెండో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(1) నిరాశపరిచి మూడో వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో టీమిండియా 65 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లోకి వెళ్లింది. ఆ తరుణంలో మురళీ విజయ్ -అజింక్యా రహానేల జోడి కాసేపు దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ప్రతిఘటించింది.. అయితే రహానే(15) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై టీమిండియా వరుసగా ప్రధాన వికెట్లను చేజార్చుకుంది. సాహా(0) , మురళీ విజయ్ (75) లు స్వల్ప పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. దీంతో టీమిండియా 154 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం టీమిండియా టీ విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రవీంద్ర జడేజా(26), అశ్విన్(4) క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డియాన్ ఎల్గర్ నాలుగు వికెట్లు సాధించగా,ఫిలిందర్, రబడా, హర్మర్ లకు తలో వికెట్ దక్కింది.