
జింబాబ్వే చేరుకున్న ధోని సేన
హరారే: మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువకులతో కూడిన భారత క్రికెట్ జట్టు గురువారం జింబాబ్వేకు చేరుకుంది. పదహారు మంది సభ్యుల భారత క్రికెట్ బృందం మంగళవారం జింబాబ్వే పయనమైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ మేరకు ధోని అండ్ గ్యాండ్ జింబాబ్వే చేరుకున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తన ట్విట్టర్ అకౌంట్లో స్పష్టం చేసింది. జింబాబ్వే పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్లను ఆడనుంది.
ఇరు జట్ల మధ్య జూన్ 11 నుంచి 15 వరకూ వన్డే సిరీస్, 18 వ తేదీ నుంచి 22 వరకూ టీ 20 సిరీస్ జరుగనుంది.జూన్ 11న తొలి వన్డే, జూన్ 13న రెండో వన్డే, జూన్ 15న మూడో వన్డే మ్యాచ్లు జరుగనున్నాయి. తొలి టీ20 జూన్ 18న, రెండో టీ20 జూన్ 20న, మూడో టీ20 జూన్ 22న జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ హరారే స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో నిర్వహించనున్నారు.