కివీస్ తో సిరీస్ కు ఢోకా లేదు!
ముంబై:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లోధా ప్యానెల్ పలు ప్రతిపాదనలు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం నూజిలాండ్ తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్ పై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ సిరీస్ ను పూర్తిగా రద్దు చేయాల్సి వస్తుందనే సంకేతాలు వెళ్లాయి. ఇందుకు కారణం బీసీసీఐ అకౌంట్లను రద్దు చేయాలంటూ బ్యాంకులకు లోధా కమిటీ సూచించినట్లు వార్తలు రావడమే. దానిలో భాగంగానే రోజువారీ నిధులను కూడా ఆపమని చెప్పలేదని లోధా తాజా ప్రకటనలో పేర్కొంది. అవసరమైతే బ్యాంకులకు రాత పూర్వకంగా వివరణ ఇస్తామని ఈ మేరకు లోధా ప్యానెల్ స్పష్టం చేసింది.
గత శుక్రవారం జరిగిన ఎస్ జీఎంలో తన అనుబంధ క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ నిధులు మంజూరు చేసింది. అయితే ఇది తమ ప్రతిపాదనలకు వ్యతిరేకం కావడంతో బీసీసీఐ అకౌంట్లను నిలుపుదల చేయాలంటూ లోధా ప్యానెల్ ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో కివీస్-భారత్ ల సిరీస్ అనేక సందేహాలు చోటు చేసుకున్నాయి. దీనిపై బీసీసీఐ వర్గాలు కూడా సిరీస్ రద్దు విషయాన్ని ధృవీకరించినట్లు వార్తలు వచ్చాయి. ప్రతీ రోజూ తాము ఏమీ చేయాలో చెప్పడానికి లోధా కమిటీ ఏర్పడలేదని బీసీసీఐ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, దీనిపై వెంటనే లోధా కమిటీ స్పందించడంతో సిరీస్ పై అలుముకున్న నీలి నీడలకు ముగింపు దొరికింది.
దాంతో పాటు వచ్చే ఏడాది ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు పాల్గొనడంపై కూడా సందిగ్ధత ఏర్పడటంతో లోధా కమిటీ వివరణ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు చాంపియన్స్ ట్రోఫీ కాల వ్యవధి పెద్దగా లేకపోయినా ఇది ముందుస్తు షెడ్యూల్ కాబట్టి ఆ రెండు సిరీస్ ల్లోనూ భారత్ పాల్గొనవచ్చని లోధా తెలిపింది.