
ముంబై: ప్రపంచ క్రికెట్‌పై బీసీసీఐ ఆధిపత్యానికి మరో నిదర్శనం! తమకు ఆదాయం వచ్చే అవకాశం లేకపోతే ఎవరితో కూడా సిరీస్‌లు ఆడేందుకు సిద్ధపడమని భారత బోర్డు తేల్చేసింది. కొత్త భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ) ప్రకారం భారత క్రికెట్ జట్టు 2019 జనవరి–ఫిబ్రవరిలలో న్యూజిలాండ్‌లో పర్యటించాలి. అయితే ఈ టూర్‌లో భారత్ కేవలం 5 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది. న్యూజిలాండ్‌లో టెస్టు మ్యాచ్ అంటే భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఉదయం 3.30 నుంచి ప్రారంభం అవుతుంది.
ఈ సమయంలో మ్యాచ్ అంటే ఆర్థికంగా తమకు గిట్టుబాటు కాదని బోర్డు భావిస్తోంది. దీంతో కివీస్‌తో ఆ దేశంలో టెస్టులు ఆడరాదని బీసీసీఐ విధానపరమైన నిర్ణయం తీసుకోవడం విశేషం. 1967–68 నుంచి 2013–14 వరకు న్యూజిలాండ్‌లో భారత్ 8 టెస్టు సిరీస్‌లు ఆడింది. ఇన్నేళ్లుగా ఇబ్బంది కలిగించని సమయం, కాలమానం విషయంలో బోర్డు ఇప్పుడు ఈ తరహాలో ఆలోచించడం ఆశ్చర్యకరం. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2018–19 సీజన్‌లో భారత్ మొత్తం 63 అంతర్జాతీయ మ్యాచ్‌లలో బరిలోకి దిగనుంది. 2019 ప్రపంచకప్ సమయానికి మొత్తం 30 వన్డేలు ఆడనున్న టీమిండియా... మరో 12 టెస్టులు, 21 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది.