
కెప్టెన్సీ 'మహిమ': భారత్ సముచిత స్కోరు
ఇండోర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ బుధవారం హోల్కర్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్నరెండో వన్డేలో టీమిండియా 248 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలో కీలక వికెట్లను వరుసగా చేజార్చుకుని కష్టాల్లో పడింది. 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడిన టీమిండియాను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదుకున్నాడు. ధోని (92 నాటౌట్: 86 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు. అంతకుముందు అజింక్యా రహానే(51) మరోసారి ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ మినహా మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీసేన ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 3 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (3) రబడా బౌలింగ్లో బౌల్డవయ్యాడు. ఆ తర్వాత ధవన్, రహానె జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కాసేపటి తర్వాత ధవన్(23).. మోర్కెల్ బౌలింగ్లో అవుటవడంతో టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపో్యాడు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద కోహ్లీ (12) రనౌట్ రూపంలో మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రహానె కూడా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే.. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఇక సురేష్ రైనా రావడం ఆలస్యమన్నట్టు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు..దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ కు మూడు వికెట్లు లభించగా, ఇమ్రాన్ తాహీర్, మోర్కెల్ లకు తలో రెండు వికెట్లు, రబడాకు ఒక వికెట్ దక్కింది.