
417 పరుగులు.. 30 వికెట్లు
కుర్రాళ్లతో వెళ్లిన టీమిండియా జింబాబ్వే పర్యటనలో దుమ్మురేపుతోంది.
కుర్రాళ్లతో వెళ్లిన టీమిండియా జింబాబ్వే పర్యటనలో దుమ్మురేపుతోంది. జింబాబ్వేతో వన్డే సిరీస్లో అన్ని విభాగాల్లోనూ మనోళ్లదే పైచేయి. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఏకపక్షం. మూడింటిలోనూ మనోళ్లదే భారీ విజయం. ఇక ప్రదర్శనలో మూడు మ్యాచ్లు సేమ్ టు సేమ్. మూడుసార్లూ తొలుత జింబాబ్వేనే బ్యాటింగ్ చేసింది. మన బౌలర్లు మూడు మ్యాచ్ల్లోనూ జింబాబ్వేను ఆలౌట్ చేశారు. అందులోనూ మూడుసార్లు తక్కువ స్కోరుకే కుప్పకూల్చారు. ఈ సిరీస్లో మ్యాచ్ మ్యాచ్కు మనోళ్లు మరింత చెలరేగిపోగా.. జింబాబ్వే ఆటగాళ్లు సొంతగడ్డపై ఢీలాపడిపోయారు. మూడు వన్డేల్లో భారత బౌలర్లు 30కి 30 వికెట్లు పడగొడితే.. జింబాబ్వే బ్యాట్స్మెన్ మూడే వన్డేల్లోనూ కలసి చేసిన పరుగులు 417 మాత్రమే!
తొలి వన్డేలో మన బౌలర్లు జింబాబ్వేను 49.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ రికార్డు సెంచరీతో పాటు తెలుగుతేజం అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో భారత్ 9 వికెట్లతో విజయం సాధించింది. రెండో వన్డేలోనూ ఇదే పరిస్థితి. జింబాబ్వే 34.3 ఓవర్లలో 126 ఆలౌట్ కాగా ధోనీసేన 8 వికెట్లో గెలుపొందింది. తాజాగా మూడో వన్డేలో జింబాబ్వే 42.2 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్లతో భారీ విజయం సాధించి, సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది.
జింబాబ్వే పర్యటన టీమిండియా కుర్రాళ్లకు బాగా ఉపయోగపడింది. కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, కరుణ్ నాయర్, ఫజల్, బుమ్రా, చహల్, ధావల్ కులకర్ణి, శ్రణ్ సత్తాచాటారు. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్, బౌలర్ బుమ్రా ఈ పర్యటనలో మెరిశారు. తొలి వన్డేలో కేఎల్ రాహుల్ రికార్డు సెంచరీ నమోదు చేశాడు. రెండో మ్యాచ్లోనూ రాణించిన రాహుల్.. మూడో వన్డేలో అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. బ్యాటింగ్లో అంబటి రాయుడు, ఫజల్ రాణించారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా దుమ్మురేపాడు. ఈ సిరీస్లో మొత్తం 9 వికెట్లు తీశాడు. చహల్ 6, ధావల్ కులకర్ణి 5, శ్రణ్ 4, అక్షర్ పటేల్ 3 మూడు వికెట్లు తీశాడు. జింబాబ్వే పర్యటనలో భారత బ్యాట్స్మెన్తో పోలిస్తే బౌలర్లకు అవకాశాలు బాగా వచ్చాయి. మూడు వన్డేల్లోనూ జింబాబ్వే తక్కువ స్కోరుకే ఆలౌట్కావడంతో భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.