
వెల్లింగ్టన్: ‘అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి’ఇది టీమిండియా ప్రదర్శణకు పక్కా సెట్ అయ్యే సామెత. గెలుపు ఎంత ఘనంగా ఉంటుందో.. ఓటమి కూడా అంతే ఘోరంగా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే మామూలుగా కాకుండా చిత్తుచిత్తుగా ఓడిపోవడం భారత జట్టుకు అలవాటయింది. ఈ మధ్యకాలంలోని టీమిండియా ఓటములను పరిశీలిస్తే అర్థమవుతోంది. తాజాగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ సేన 80 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.
అయితే టీ20ల్లో టీమిండియాకు పరుగుల పరంగా ఇదే అతి పెద్ద ఓటమి. 2010లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో అప్పటి భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పటివరకు అదే పెద్ద ఓటమి కాగా తాజాగా తొమ్మిదేళ్ల తర్వాత ఆ రికార్డును టీమిండియా తిరగరాసింది. అడితే అందరూ కలిసికట్టుగా ఆడటం లేకుంటే సమిష్టిగా విఫలమవ్వడం చాంపియన్ జట్టు తత్వం కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాపార్డర్ విఫలమైన ప్రతీసారి భారత జట్టు ఘోరంగా ఓడిపోతుందని.. మిడిలార్డర్ గురించి సెలక్షన్ కమిటీ ఆలోచించాలని మాజీ క్రికెటర్లు సలహాలిస్తున్నారు. ఇప్పటివరకు టీమిండియా 111 టీ20 మ్యాచ్‌లు ఆడగా 69 విజయాలు సాధించగా, 38 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక రెండో సారి బ్యాటింగ్ చేసి ఓడిపోయిన మ్యాచ్‌లు 17, ఇందులో 11 మ్యాచ్‌లు భారీ లక్ష్యాలను చేదించే క్రమంలో ఓడిపోయినవే కావడం గమనార్హం.