
పుణే: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ కుర్రాడు గంధం ప్రణవ్ రావు పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ ఈవెంట్ అండర్–17 బాలుర సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ ప్రణవ్ 15–21, 21–18, 21–11తో రెండో సీడ్ రవి (హరియాణా)పై విజయం సాధించాడు.
మేఘనకు మూడు పతకాలు
రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో తెలంగాణ అమ్మాయి గుండ్లపల్లి మేఘన రెడ్డి స్వర్ణం సహా రెండు రజతాలు కలిపి మొత్తం మూడు పతకాలను సొంతం చేసుకుంది. ‘హూప్’ ఈవెంట్‌లో మేఘన 11.05 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని దక్కించుకోగా... ‘బాల్’ ఈవెంట్‌లో ఆమె 12.35 పాయింట్లు... ‘రిబ్బన్’ ఈవెంట్‌లో 10.50 పాయింట్లు సాధించి ఆమె రజత పతకాలను కైవసం చేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 76 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చుక్కా శ్రీలక్ష్మి 139 కేజీలు బరువెత్తి కాంస్య పతకాన్ని సాధించింది.