హరియాణాలోని పంచకులలో జరుగుతోన్న ఖేలో ఇండియా యూత్ అథ్లెటిక్స్‌లో జార్ఖండ్‌కు చెందిన సుప్రీతి కచ్చప్ 3000 మీటర్లను 9 నిమిషాల,46.14 సెకన్లల్లో పరుగెత్తి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రాక్ మీద రన్నింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. కనీసం నడవడం కూడా నేర్చుకోని సమయంలో తండ్రిని కోల్పోయి, అమ్మ పెంపకంలో నడక నేర్చుకుని, పట్టుదల కష్టంతో రన్నింగ్‌లో దూసుకుపోతుంది.
జార్ఖండ్‌లోని బుర్హు గ్రామానికి చెందిన సుప్రీతి తండ్రి రామ్‌సేవక్ ఓరాన్ ఇంటికి దగ్గరలో ఉన్న గ్రామంలో డాక్టర్‌గా పనిచేసేవారు. తల్లి బాలమతి గృహిణి. అది 2003.. ఓ రోజు రాత్రవుతున్నా రామ్‌సేవక్ ఇంటికి రాలేదు. తండ్రి కోసం సుప్రీతితో పాటు అమ్మ, నలుగురు తోబుట్టువులు ఎదురు చూస్తున్నారు. అర్థరాత్రి అయినా ఇంకా ఇంటికి చేరలేదు. అదే రోజు రామ్ సేవక్‌ను తుపాకితో కాల్చి చంపి చెట్టుకు వేలాడదీశారు నక్సలైట్లు. ఈ విషాధకర దుర్ఘటన జరిగినప్పుడు సుప్రీతి బుడిబుడి అడుగులు కూడా సరిగా వేయలేని చిన్నారి. రామ్ సేవ్‌క్ చనిపోయిన తరువాత బాలమతికి బీడీవో ఆఫీసులో నాలుగోతరగతి ఉద్యోగం వచ్చింది. దీంతో తన ఐదుగురు íపిల్లలతో గుమ్లాలోని గవర్నమెంట్ క్వార్టర్స్‌లోకి మకాం మార్చింది.
మట్టి ట్రాక్‌పై పరుగెడుతూ..
క్వార్టర్స్‌లో ఉన్న మిగతా పిల్లలతో సుప్రీతి ఎంతోయాక్టివ్‌గా ఆడుకుంటూనే, దగ్గర్లోని గ్రౌండ్లో రన్నింగ్ సాధన చేస్తుండేది. సుప్రీతికి రన్నింగ్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన బాలమతి మరింత ప్రోత్సహించి రన్నింగ్ చేయమని చెప్పేవారు. దీంతో నుక్రుడిప్పా చెయిన్‌పూర్ స్కూల్లో ఉన్న చిన్నపాటి మట్టి ట్రాక్‌పైనే కొన్నేళ్లు రన్నింగ్ చేసేది. తరువాత సెయింట్ పాట్రిక్ స్కూల్‌కు మారింది.
అక్కడ సుప్రీతి ప్రతిభను గుర్తించిన యాజమాన్యం ఆమెకు స్కాలర్‌షిప్‌ను అందించి అథ్లెట్స్‌తో కలిసి శిక్షణ ఇప్పించింది. శిక్షణ తీసుకుంటూ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో పాల్గొన్న సుప్రీతి కోచ్ ప్రభాత్ రంజన్ తివారీ దృష్టిలో పడింది. దీంతో సుప్రీతికి మరింత శిక్షణ ఇస్తే మెడల్స్ సాధిస్తుందని గ్రహించిన ప్రభాత్ 2015ల గుమ్రాలోని జార్ఖండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఇక్కడ 400 మీటర్లు, 800 మీటర్లు చాలా వేగంగా పరుగెత్తడం నేర్చుకుంది. క్రమంగా ఆమె వేగాన్ని 1500 మీటర్లకు పెంచారు. దీంతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేది.
తొలి మెడల్
సుప్రీతి 2019లో మధురలో జరిగిన నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని తొలిసారి 2000 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకం గెలుచుకుంది. ఇదే ఏడాది గుంటూరులో జరిగిన 3000 మీటర్ల నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం అందుకుంది.
క్రమంగా తన రన్నింగ్‌ను మెరుగు పరుచుకుంటూ గడిచిన మూడేళ్లలో పదినిమిషాల్లో మూడువేల మీటర్లను ఛేదించి వెండిపతకం, కాంస్య పతకాలను జూనియర్ ఫెడరేషన్ కప్‌లో గెలుచుకుంది.
వారానికి 120 కిలోమీటర్లు..
సుప్రీతి లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు పట్టుదలతో తీవ్రంగా సాధన చేసేది. దీంతో వారానికి 80 కిలోమీటర్లు రన్నింగ్ చేసే సామర్థ్యాన్ని, వారానికి 120 కిలోమీటర్లకు పెంచింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ముందు కోజికోడ్‌లోని ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల ఐదువేల మీటర్ల కాంపిటీషన్‌లో పాల్గొంది. 16.40 నిమిషాల్లో పూర్తిచేయాల్సిన రేసుని 16.33 సెకన్లలో పూర్తిచేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు అర్హత సాధించింది. తాజాగా ఖేలో ఇండియా గేమ్స్‌లో జార్ఖండ్ రాష్ట్ర పతకాల జాబితాలో గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది సుప్రీతి.
‘అదృష్టంలేదు, ఎంత ప్రయత్నించినా నెగ్గలేకపోతున్నాం’ అని చెప్పేవాళ్లకు, కష్టడితే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి సుప్రీతి ఉదాహరణగా నిలుస్తోంది.
‘‘నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎంతోమంది అనేక గేమ్స్‌లో విజేతలుగా నిలుస్తున్నారు. వీరంతా నాకు ప్రేరణ. అనేక మంది సక్సెస్ స్టోరీల నుంచి స్ఫూర్తిని పొంది నేను ఇప్పుడు గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నాను. మానాన్న ఎలా ఉండేవారో నాకు గుర్తులేదు. కానీ ఈ మెడల్ ఆయనకే అంకితం ఇస్తున్నాను. నా విజయం వెనుక అమ్మ, కోచ్‌ల ప్రోత్సాహం చాలా ఉంది. పరిస్థితులు మనకు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కష్టపడి వాటì ని అనుకూలంగా మార్చుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చు’’
– సుప్రీతి
స్ఫూర్తి: సూపర్ రన్నర్ సుప్రీతి!
Published Sat, Jun 11 2022 5:39 AM | Last Updated on Sat, Jun 11 2022 5:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment