జాతీయ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లకు మూడు పతకాలు లభించాయి.
జాతీయ జూనియర్, క్యాడెట్ టీటీ టోర్నీ
సాక్షి, రాజమండ్రి: జాతీయ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లకు మూడు పతకాలు లభించాయి. సబ్ జూనియర్ బాలుర విభాగంలో రజతం దక్కగా... సబ్ జూనియర్ బాలికల విభాగంలో... క్యాడెట్ బాలుర విభాగంలో కాంస్య పతకాలు లభించాయి. బుధవారం సబ్ జూనియర్ బాలుర టీమ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 1-3 తేడాతో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) ‘ఎ’ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఫిడేల్ రఫీక్ స్నేహిత్ 11-7, 13-11, 11-6తో రీగన్ అల్బుక్యూర్‌క్యూను ఓడించి తెలంగాణకు శుభారంభాన్ని అందించాడు.
అయితే తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో తెలంగాణ క్రీడాకారులు ఓడిపోవడంతో పీఎస్‌పీబీ జట్టుకు టైటిల్ ఖాయమైంది. సబ్ జూనియర్ బాలికల సెమీఫైనల్లో తెలంగాణ 0-3తో తమిళనాడు చేతిలో; క్యాడెట్ బాలుర సెమీఫైనల్లో తెలంగాణ 1-3తో పీఎస్‌పీబీ ‘ఎ’ జట్టు చేతిలో ఓటమి పాలై కాంస్య పతకాలు సాధించాయి.