
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్–5లో తొలిసారి తెలుగు టైటాన్స్ చెలరేగింది. ప్రత్యర్థి జట్టుకు అందనంత వేగంగా పాయింట్లు కొల్లగొట్టింది. దీంతో ఇంటర్ జోన్ చాలెంజ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 44–22 స్కోరులో దబంగ్ ఢిల్లీపై భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు రైడింగ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లను వణికించింది. వరుసగా పాయింట్లు సాధించి ఢిల్లీపై ఒత్తిడి పెంచింది. ఆ జట్టును ఏకంగా మూడు సార్లు ఆలౌట్ చేసింది. రైడర్ రాహుల్ చౌదరి (16) కదంతొక్కాడు. 21 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను 15 పాయింట్లు తెచ్చిపెట్టాడు. టాకిల్‌లో మరో పాయింట్ చేశాడు. మిగతావారిలో మోసిన్ (7), నీలేశ్ సాలుంకే (5) రాణించగా... డిఫెండర్ విజయ్ భరద్వాజ్ 4 టాకిల్ పాయింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ తరఫున అబొల్‌ఫజల్ 7 పాయింట్లు చేయగా, రోహిత్ బలియాన్, సత్పాల్, స్వప్నిల్ షిండే తలా 4 పాయింట్లు సాధించారు. ఈ సీజన్‌లో 19 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరో విజయం కాగా... దబంగ్ ఢిల్లీకి 13వ పరాజయం.
యు ముంబా గెలుపు...
అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కశిలింగ్ అడకె (17 పాయింట్లు) అద్భుతమైన ప్రదర్శనతో యు ముంబా 42–30 స్కోరుతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. ఆట మొదలైన తొలి నిమిషంలోనే అనూప్ కుమార్, కశిలింగ్ చెరో పాయింట్ చేసి యు ముంబాకు 2–0తో శుభారంభమిచ్చారు. ఇదే జోరుతో తొలి అర్ధభాగంలో కశిలింగ్ ఏకంగా 15 పాయింట్లు సాధించిపెట్టాడు. దీంతో యు ముంబా 23–13తో ప్రథమార్ధాన్ని ముగించింది. ద్వితీయార్ధంలో అనూప్ కుమార్ (5), డిఫెండర్ సురీందర్ సింగ్ (6)లు రాణించడంతో ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన ముంబా జట్టు బెంగళూరును సులువుగానే ఓడించింది. బెంగళూరు బుల్స్ తరఫున రోహిత్ కుమార్ రైడింగ్‌లో 12 పాయింట్లు చేయగా, హరీశ్ నాయక్, గుర్విందర్ సింగ్, సునీల్ జైపాల్ తలా 3 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో పుణేరి పల్టన్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.