
సచిన్ చెప్పిందే జరిగింది: హార్ధిక్ పాండ్యా
టీమిండియా జట్టులో నువ్వు సభ్యుడిగా మారతావని గతేడాది క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనతో చెప్పాడని గుజరాత్ యువ సంచలనం హార్థిక్ పాండ్యా చెప్పాడు.
కోల్ కతా: టీమిండియా జట్టులో నువ్వు సభ్యుడిగా మారతావని గతేడాది క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనతో చెప్పాడని గుజరాత్ యువ సంచలనం హార్థిక్ పాండ్యా చెప్పాడు. గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడుతున్నప్పుడు సచిన్ తనతో ఈ మాట చెప్పారని పేర్కొన్నాడు. వచ్చే 12 నెలల్లో భారత జట్టుకు ఎంపిక అవుతావని తనలో స్ఫూర్తిని పెంచారని సచిన్ గురించి చెప్పుకొచ్చాడు యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పటేల్. సచిన్ చెప్పిన కేవలం 7 నెలల తర్వాత తాను భారత్ తరఫున మ్యాచ్ లకు ఎంపిక అయ్యానంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. అశీష్ నెహ్రా నేతృత్వంలో బౌలింగ్ చేయడం తనకు కలిసొచ్చిందని, కావాల్సినప్పుడల్లా ఆశూ భాయ్ సలహాలు అడుగుతూనే ఉంటానని చెప్పుకొచ్చాడు.
నువ్వు అనుకున్న దానికంటే కూడా మెరుగ్గా బౌలింగ్ చేయలవని తనని ప్రోత్సహించాడని చెప్పాడు. అది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. గతేడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాను. ఇప్పుడు టీమిండియాకు ఆడుతున్నాను అన్నాడు. తాను ఆల్ రౌండర్ అని, దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వస్ కలిస్ తరహాలో గొప్ప ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు హార్ధిక్ పాండ్యా వివరించాడు.