ఆలస్యానికి అడ్రస్ లక్ష్మణ్
కోల్‌కతా: సచిన్‌కు తెలిసింది రెండే రెండు... మైదానంలో పరుగుల వరద పారించడం, ఆ తర్వాత షాపింగ్‌లో మునగడం! అతని సహచరుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పిన ముచ్చట ఇది. సొంతగడ్డపై భారత్ 250వ టెస్టు ఆడుతున్న సందర్భంగా కొందరు క్రికెటర్లతో సరదాగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తమ డ్రెస్సింగ్ రూం విశేషాలను ఆటగాళ్లు పంచుకున్నారు.
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ‘మ్యాచ్‌లో సెంచరీ చేశాడంటే మరుసటి రోజు సచిన్‌కు షాపింగ్ తప్ప మరో వ్యాపకం ఉండేదికాదు. అర్మానీ, వెర్సెస్‌లాంటి బ్రాండింగ్ డ్రెస్‌లు అతని వార్డ్‌రోబ్‌లో చాలా కనిపిస్తాయి. తన దుస్తుల విషయంలో సచిన్ ప్రత్యేక శ్రద్ధ పెడతాడు’ అని చెప్పారు. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అయితే ఆలస్యానికి కేరాఫ్ అడ్రస్ అని గంగూలీ గుర్తు చేసుకున్నారు. ‘నాలుగో, ఐదో స్థానం ఆటగాళ్లు క్రీజ్‌లో ఉన్న సమయంలో కూడా అతను ఇంకా బాత్‌రూంలో స్నానం చేస్తూ కనిపించేవాడు.
టీమ్ బస్సులోకి అందరికంటే ఆలస్యంగా వచ్చేది కూడా అతనే’ అని గంగూలీ అన్నారు. తాను ఆడిన రోజుల్లో శుచీ శుభ్రతా గురించి అసలు ఏ మాత్రం పట్టించుకోని ఆటగాళ్లంటే సిద్ధూ, అజయ్ జడేజాలే అని మరో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ చెప్పారు. ‘ఉత్తరాదివారే దూకుడుగా ఉంటారని మేం అనుకునేవాళ్లం. దక్షిణాదివాళ్లు సున్నితంగా, ప్రశాంతంగా ఉంటారని భావించాం. కానీ కుంబ్లే తన ఆటతో వారిలోని దూకుడును చూపించాడు’ అని కపిల్‌దేవ్ వ్యాఖ్యానించడం విశేషం.