నేర్చుకుంది చాలు...ఇక గెలవడం ముఖ్యం!
♦ టెస్టు కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య
♦ బంగ్లాదేశ్‌కు బయల్దేరిన భారత జట్టు
భారత జట్టు పరాజయంపాలైన సందర్భాల్లో కెప్టెన్‌గా ధోని సాధారణంగా ఎప్పుడూ చెప్పే సమాధానం ఒక్కటే. ‘ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్చుకోగలిగాం. ఎలా ఆడామన్నది కూడా ముఖ్యం. కాబట్టి ఫలితాలకంటే దానిని సాధించే క్రమంలో ప్రక్రియకు నా దృష్టిలో ప్రాధాన్యత’ అని అతను వివరణ ఇచ్చేవాడు. కానీ ఆటలోనూ, మాటలోనూ ధోనికి భిన్నంగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా తన ఆలోచనను కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. అదీ ధోని ధోరణికి పూర్తి విరుద్ధంగా! మ్యాచ్‌లో నేర్చుకోవడాన్ని తాను నమ్మనని, గెలుపే ముఖ్యమని అతను వ్యాఖ్యానించడం విశేషం.
కోల్‌కతా : బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు ఆదివారం ఢాకా బయల్దేరి వెళ్లింది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. సిరీస్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అతను తన అభిప్రాయాలు వెల్లడించాడు. విశేషాలు కోహ్లి మాటల్లోనే...
సన్నాహాలపై : జట్టులోని ఆటగాళ్లంతా ఉత్సాహం గా ఉన్నారు. కొంత విరామం తర్వాత దీనిని కొత్త ఆరంభంగా చెప్పవచ్చు. మన జట్టుకు సంబంధించి ఫిట్‌నెస్ అనేది ఎప్పుడూ సమస్యే. శనివారం ఫిట్‌నెస్ టెస్టులో అంతా బాగుంది. ఇరు జట్ల మధ్య ప్రపంచకప్ క్వార్టర్స్ మ్యాచ్ ప్రభావం, ప్రతీకారం తీర్చుకోవడంలాంటిది ఇక్కడ ఏమీ ఉండదు. అదంతా గతం.
కెప్టెన్సీపై : టెస్టు కెప్టెన్‌గా నేను కూడా ఎంతో ఉద్వేగంగా ఉన్నాను. వన్డేలు, టి20లతో పోలిస్తే టెస్టు కెప్టెన్సీ భిన్నం. కాబట్టి దానికి సంబంధించి నా దృష్టిలో భిన్నమైన వ్యూహాలు ఉన్నాయి. గతంలో కెప్టెన్సీ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొత్త కాదు. ఆస్ట్రేలియాలో నాయకత్వం వహించినప్పుడు చాలా నేర్చుకున్నాను. టీమ్ బాగుంది కాబట్టి అదే నిలకడను కొనసాగిస్తాను.
భారత జట్టు భవిష్యత్తుపై : ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదల్చుకున్నా. మనం ఇప్పటికే చాలా నేర్చుకున్నాం. నేర్చుకోవాలనే ఆలోచనతో మ్యాచ్ బరిలోకి దిగడం, నేర్చుకుంటూనే ఉండటం సరైంది కాదు. టీవీలో చూసి కూడా నేర్చుకోవచ్చు! మనం తగినన్ని టెస్టులు ఆడాం. ఇకపై ఆ ప్రతిభను ఉపయోగించుకోవాలి. కాబట్టి టెస్టులు గెలవడమే లక్ష్యంగా మైదానంలోకి దిగాలి. గత కొన్ని టెస్టుల్లో చాలా నేర్చుకున్నాం. ఇకపై ఫలితాలు సాధించడమే ముఖ్యమని నా అభిప్రాయం.
డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణంపై : నేను ఈ టూర్‌లో ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోలేదు. అసలు అవి లక్ష్యాలు కావనే నేను చెబుతాను. మ్యాచ్‌ను గెలిపించలేని సెంచరీ వృథా. కాబట్టి ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే వాతావరణం నేను కల్పిస్తాను. మ్యాచ్ గెలవాలంటే ముందుగా మైండ్‌సెట్ అలాగే ఉండటం అవసరం.
ఇంకా ఎక్కువ కాలం ఉంటానేమో : రవిశాస్త్రి
భారత జట్టుకు ప్రస్తుతం ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌లు ఉన్నారని, ఈ పరిస్థితుల్లో హెడ్ కోచ్ లేకపోవడం సమస్య కాదని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి వ్యాఖ్యానిం చారు. అవసరమైన సమయంలో తాను ఆ పాత్రలో ఒదిగిపోగలనని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత కూడా తాను కొనసాగే అవకాశం ఉందని రవి చూచాయగా చెప్పారు. ‘బంగ్లా టూర్ తర్వాత బీసీసీఐ పెద్దలతో చర్చించాల్సి ఉంది. మీరు అనుకుంటున్న దానికంటే ఎక్కువ సమయం జట్టుతో ఉంటానేమో. ప్రస్తుతానికి నేను దేనినీ కొట్టిపారేయడం లేదు’ అని శాస్త్రి స్పష్టం చేశారు.