థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ శుభారంభం చేశాడు.
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ శుభారంభం చేశాడు. నథానియల్ (ఇండోనేసియా)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ సాయిప్రణీత్ తొలి గేమ్‌ను 21–10తో గెలిచి, రెండో గేమ్‌లో 18–9తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి గాయంతో వైదొలిగాడు.
హైదరాబాద్‌కే చెందిన చిట్టబోయిన రోహిత్ యాదవ్, రాహుల్ యాదవ్, సిరిల్ వర్మ, గురుసాయిదత్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. రోహిత్ 12–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో, రాహుల్ 15–21, 17–21తో అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్) చేతిలో, సిరిల్ వర్మ 16–21, 21–13, 17–21తో హద్మాదీ (ఇండోనేసియా) చేతిలో, గురుసాయిదత్ 12–21, 12–21తో మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన హర్షీల్, అరుణ్, ఆదిత్య జోషి, అభిషేక్ కూడా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.