
అలా ఎవరూ ఊహించలేరు: గంభీర్
కోల్‌కతా: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, తమ టీమ్ సహచరుడు క్రిస్ లిన్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే ‘హార్డెస్ట్ హిట్టర్’ అంటూ పొడిగాడు. బంతిని బలంగా బాదడంలో అతడిని మించినవాడు లేడని ఆకాశానికెత్తేశాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడని మెచ్చుకున్నాడు.
‘అంతర్జాతీయ క్రికెట్‌లో బంతిని బలంగా కొట్టడంతో క్రిస్ లిన్ అందరికంటే ముందుంటాడు. పునరాగమనం ఇంత ఘనంగా చాటతానని అతడే అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే గాయంతో నెల రోజులు ఆటకు దూరమై బరిలోకి దిగిన వెంటనే నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడడం మామూలు విషయం కాదు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఊహించని రీతిలో అతడు చెలరేగాడు. సునీల్ నరైన్, లిన్ ఇద్దరూ రెండువైపుల హిట్టింగ్ చేశారు. ఇలాంటి ఇన్నింగ్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆరు ఓవర్లలో 105 పరుగులు చేస్తారని ఎవరూ ఊహించరు. నరైన్ ఓపెనర్‌గా పంపడం మంచి ఫలితాన్ని ఇచ్చింద’ని ఓ ఇంటర్య్వూలో గంభీర్ పేర్కొన్నాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నరైన్, లిన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నరైన్ 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేయగా, లిన్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు.