కోహ్లి, కుంబ్లేలపై సంచలన ఆరోపణలు
రాంచీ: భారత్- ఆస్ట్రేలియాల మధ్య డీఆర్‌ఎస్ వివాదం ఇంకా ముగియలేదు. ఇప్పటికే ఈ వివాదంలో ఆసీస్ ఆటగాళ్లపై ఐసీసీ ఏలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఆస్ట్రేలియన్ ది టెలిగ్రాఫ్ దిన పత్రికలో భారత్ కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లేలపై వివాదస్పద కథనాలు వచ్చాయి. బెంగళూరు టెస్టులో కోహ్లి ఏనర్జిడ్రింక్ బాటిల్‌ను ఆసీస్ అధికారులపైకి విసిరి అసహనం వ్యక్తం చేశాడని, అదే తీరుగా కోచ్ కుంబ్లే అంపైర్లపై అరిచాడని ఆరోపించింది.
ఇదంతా 2008 ఆసీస్ పర్యటనలో హర్భజన్ సింగ్, సైమండ్స్‌ల మధ్య జరిగిన మంకీ గేట్ వివాదం ప్రతీకారంగానే జరిగిందని తెలిపింది. ఆ సమయంలో కుంబ్లే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడని అందువల్లే ఇలా వ్యవహరిస్తున్నాడని ప్రచురించింది. ఇంతే కాకుండా కోహ్లి, ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యండ్స్‌కోంబ్‌పై నోరు పారేసుకున్నాడని, అవుటైనపుడు డ్రెస్సింగ్ రూంలో అసహనంతో ఎదురుగా కూర్చున్న ఆసీస్ అధికారులపై బాటిల్ విసిరాడని పేర్కొంది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి అవుటయినప్పుడు కుంబ్లే సహనం కోల్పోయి అంపైర్‌లపై అరిచాడని, టీవీ రిప్లులే చూస్తే ఆ బాటిల్ ఆసీస్ అధికారుల కాళ్ల దగ్గర పడ్డట్లు తెలుస్తుందని వెల్లడించింది. కోహ్లితో సహా కోచ్ అనిల్ కుంబ్లేలు క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించింది.