సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీనియర్ జట్టు కోచ్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి కొనసాగనున్నాడు. గత రెండేళ్లుగా జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న జోషిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నమ్మకముంచింది. 2011-12 సీజన్‌లో సునీల్ జోషి తొలి సారిగా హైదరాబాద్ జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు.
ఆ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్, ‘ప్లేట్’ డివిజన్ నుంచి ‘ఎలైట్’ స్థాయికి ఎగబాకింది. దాంతో గత సీజన్‌లో మరిన్ని ప్రోత్సాహకాలు అందజేస్తూ ఏకగ్రీవంగా జోషిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 2012-13 సీజన్ మాత్రం హైదరాబాద్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న జట్టు చెత్త ఆటతీరుతో గ్రూప్ ‘సి’కి పడిపోయింది. దాంతో జోషిపై కూడా విమర్శలు వచ్చాయి.
హెచ్‌సీఏలో దీనిపై తీవ్ర చర్చ కూడా జరగడంతో సీనియర్ టీమ్ కోచ్ ఎంపికను వాయిదా వేస్తూ వచ్చారు. బుచ్చిబాబు టోర్నీలో పాల్గొనే జట్టుకు అబ్దుల్ అజీమ్‌ను కోచ్‌గా ఎంపిక చేయడంతో జోషికి గుడ్‌బై చెప్పినట్లేనని భావించారు. అయితే జట్టు వైఫల్యాలకు కోచ్‌నే పూర్తిగా బాధ్యుడిని చేయాల్సిన అవసరం లేదని, కోచ్‌గా అతను బాగా చేస్తున్నాడని హెచ్‌సీఏ సభ్యులు కొంత మంది కితాబిచ్చారు. ఫలితంగా సునీల్ జోషినే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 2నుంచి జరిగే మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీనుంచి జోషి తన బాధ్యతలు చేపడతాడు.
మూడో ఏడాదీ కొనసాగింపు
Published Thu, Aug 8 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement