
ఐపీఎల్‌కు ‘సీఓఏ’ అడ్డంకులు!
ముంబై: మరో నెల రోజుల్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల దగ్గర తగిన ఆర్థిక వనరులు లేకపోవడమే దీనికి కారణం. ఇటీవల ముంబైలో జరిగిన ఐపీఎల్ కమిటీ, క్రికెట్ సంఘాల మధ్య జరిగిన సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగింది. వెంటనే బీసీసీఐ ఆయా సంఘాలకు నిధులను విడుదల చేయాలని, లేకుంటే లీగ్‌ను నిర్వహించే పరిస్థితి ఉండదని సంఘాలకు చెందిన సభ్యులు స్పష్టం చేశారు. ఆతిథ్యమిచ్చే క్రికెట్ సంఘాలకు ప్రతీ లీగ్ మ్యాచ్‌కు రూ.60 లక్షల చొప్పున గ్రాంట్ విడుదలయ్యేది. ఇందులో సగం బోర్డు ఇవ్వగా మిగతా సగం ఫ్రాం చైజీ ఇస్తుంది. అలాగే ఇంతకుముందు క్రికెట్ సంఘాలకు కొంచెం అడ్వాన్స్‌గా బోర్డు విడుదల చేసేది. కానీ లోధా ప్యానెల్ సంస్కరణల అమలు నేపథ్యంలో వీటికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ‘గతంలో ఇది మాకు పెద్దగా సమస్యగా అనిపించేది కాదు. అడ్వాన్స్‌గా బోర్డు ఇచ్చే మొత్తం నుంచి మాకు కావాల్సిన పరికరాల కొనుగోలుతో పాటు మైదానం, డ్రెస్సింగ్ రూమ్, ఫ్లడ్‌లైట్లకు సంబంధించిన మరమ్మతులను పూర్తి చేసేవాళ్లం. ముందు మేం ఖర్చు పెట్టుకున్నా ఆ తర్వాత వారు ఇచ్చే పరిస్థితి ఉంటుందో లేదో తెలీడం లేదు. అన్నింటిని అరువుపై తెచ్చేందుకు ఏ క్రికెట్ సంఘం కూడా సిద్ధంగా లేదు’ అని పలు క్రికెట్ సంఘాలు పేర్కొన్నాయి.
‘పరిమిత’ ఆహ్వానంపై అసంతృప్తి
ఈనెల 8న జరిగే బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి షరతులతో కూడిన ఆహ్వానంపై రాష్ట్ర క్రికెట్ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి నిరసనగా బాయ్‌కాట్ చేసే ఆలోచనలో సంఘాలున్నాయి. ‘సుప్రీం కోర్డు తీర్పునకు లోబడి అర్హత ఉన్న ఆఫీస్ బేరర్లు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పరిపాలక కమిటీ (సీఓఏ) కోరుకుంటోంది’ అని బీసీసీఐ నుంచి వచ్చిన ఆహ్వానంతో సంఘాలు కంగుతిన్నాయి. ‘అవార్డు ఫంక్షన్‌లకు పిలిచేటప్పుడు ఇలా షరతులు విధించకూడదు. క్రికెట్ సంఘాలకు తమ తరఫున ప్రతి నిధులను పంపే విశేషాధికారం ఉంటుంది’ అని పలువురు క్రికెట్ సంఘాల సభ్యులు అన్నారు.