
విశాఖలో భారత్-విండీస్ మూడో వన్డే రద్దు
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మూడో వన్డే రద్దయింది.
విశాఖపట్నం: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఈ నెల 14న జరగాల్సిన మూడో వన్డే రద్దయింది. హుదూద్ తుఫాన్ కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. విశాఖలో మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేవని బీసీసీఐకు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) తెలిపింది.
తుఫాన్ విరుచుకుపడడంతో విశాఖపట్నం వణికింది. ప్రపంచ పవనాల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గుడిసెలు, రేకుల షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి. భీకర గాలులకు తోడు భారీ వర్షాలు కురుస్తుండడంతో విశాఖ తడిసిముద్దయింది. స్టేడియం అంతా వర్షపు నీటితో ముగినిపోయింది.
వర్షం లేకపోతే భారత్, వెస్టిండీస్‌ల మధ్య మూడో వన్డేను నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ముందుకు వచ్చినప్పటికీ వాతావరణం సహకరించకపోవడంతో వెనక్కు తగ్గాల్సివచ్చింది. ఇప్పటికిప్పుడు వన్డే వేదికను మార్చే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేయాల్సివచ్చింది.