నాలుగేళ్ల క్రితం కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యంతో సంతృప్తి పడిన భారత అగ్రశ్రేణి షట్లర్ పారుపల్లి కశ్యప్ ఈసారి స్వర్ణ పతకంపై గురి పెట్టాడు.
న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యంతో సంతృప్తి పడిన భారత అగ్రశ్రేణి షట్లర్ పారుపల్లి కశ్యప్ ఈసారి స్వర్ణ పతకంపై గురి పెట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) వైదొలగడంతో పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ టైటిల్ ఫేవరెట్‌గా అవతరించాడు. ‘లీ చోంగ్ వీ తప్పుకోవడంతో నేను పసిడి పతకంపై దృష్టి సారించాను. రెండో సీడ్‌గా ఉన్న నేను స్వర్ణం సాధించగలనని తెలుసు.
అయితే వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా), రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) నుంచి గట్టిపోటీ తప్పదు. నాతోపాటు శ్రీకాంత్, గురుసాయిదత్‌లకూ పతకాలు నెగ్గే సత్తా ఉంది’ అని కశ్యప్ తెలిపాడు. క్రితంసారి న్యూఢిల్లీలో భారత బ్యాడ్మింటన్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసి నాలుగు పతకాలు గెలిచింది. గ్లాస్గో క్రీడల్లో భారత్ దీనికంటే మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఈ హైదరాబాద్ ప్లేయర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.