
ధర్మశాల:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఇక్కడ ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో తమ జట్టు ఘన విజయం సాధించడంలో బౌలర్లదే కీలక పాత్ర అని శ్రీలంక కెప్టెన్ తిషారా పెరీరా ప‍్రశంసల వర్షం కురిపించాడు. భారత్ స్కోరు కనీసం 250-260 మధ్య చేస్తుందని భావిస్తే.. వారు స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఘనత బౌలర్లదని కొనియాడాడు.
'తొలి వన్డేలో విజయం సాధించిన ఘనత 200 శాతం మా బౌలర్లదే. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో మా బౌలర్లు బౌలింగ్ చేశారు. ఇది మా గెలుపు కారణం. కాకపోతే ఇది ఆటకు అనుకూలించే వికెట్ ఎంతమాత్రం కాదు.. ఈ తరహా వికెట్‌ను మేము ఊహించలేదు. భారత్ జట్టు 260 పరుగులు చేస్తుందని అనుకున్నాం. కానీ సురంగా లక్మల్, ఏంజెలో మాథ్యూస్‌లు క‍్రమశిక్షణతో కూడిన బౌలింగ్ చేసి టీమిండియాను కట్టడి చేశారు. టెస్టు సిరీస్‌లో రాణించిన లక్మల్.. తొలి వన్డే మ్యాచ్‌లో కూడా రాణించాడు. ఈ సమయంలో మాకు ఉన్న ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ ఆప్షన్ లక్మల్. అతనిపై పెట్టుకున్న అంచనాల్ని నిజం చేస్తూ గెలుపుకు బాటలు వేశాడు. మిగతా బౌలర్లు కూడా అతనికి సహకరించడంతో ఘన విజయాన్ని అందుకున్నాం' అని పెరీరా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment