దిగ్గజాల వల్ల కాలేదు.. మరి పైన్‌ సాధిస్తాడా? | Tim Paine On Verge Of Ashes Landmark | Sakshi
Sakshi News home page

దిగ్గజాల వల్ల కాలేదు.. మరి పైన్‌ సాధిస్తాడా?

Published Tue, Sep 10 2019 12:13 PM | Last Updated on Tue, Sep 10 2019 12:15 PM

Tim Paine On Verge Of Ashes Landmark - Sakshi

మాంచెస్టర్‌: యాషెస్‌ సిరీస్‌ అంటే ఆసీస్‌-ఇంగ్లండ్‌లకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఇది ఇరు జట్ల మధ్య జరిగే ఒక యుద్ధంగా చెప్పొచ్చు. మరి అటు మెగా యుద్ధంలో ఒక కెప్టెన్‌కు అరుదైన అవకాశం వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది. అందులోనూ దిగ్గజాల వల్ల కానిది.. అనుకోకుండా జట్టు కెప్టెన్‌ అయి దాన్ని సాధిస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు.  ఇప్పుడు ఈ తరహా రికార్డే ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ను ఊరిస్తోంది. ఆసీస్‌ దిగ్గజ ఆటగాళ్లు, మాజీ కెప్టెన్లు అయిన గ్రెగ్‌ చాపెల్‌, రికీ పాంటింగ్‌, మైకేల్‌ క్లార్క్‌లకు సాధ్యం కానిది.. పైన్‌ ముంగిట నిలిచింది. ఇంగ్లండ్‌ గడ్డపై ఆసీస్‌ యాషెస్‌ సిరీస్‌ను గెలిచిన సందర్బాలు చాలా తక్కువే. సుమారు 18 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లో ఆసీస్‌ చివరిసారిగా యాషెస్‌ సిరీస్‌ గెలిస్తే, అప్పట్నుంచి ఇప్పటివరకూ ఇంగ్లండ్‌ వేదికలో ఆసీస్‌ మళ్లీ ఆ సిరీస్‌ను గెలవలేదు.  ఇంగ్లండ్‌లో 2001లో స్టీవ్‌ వా నేతృత్వంలోని ఆసీస్‌ యాషెస్‌ సిరీస్‌ను గెలిచింది. ఆ తర్వాత ఆసీస్‌ ఆ చాన్స్‌ ఇవ్వలేదు ఇంగ్లండ్‌. తమ దేశంలో ఓడించడమంటే మీ వల్ల కాదనే విషయాన్ని ఇంగ్లండ్‌ చాటి చెబుతూనే ఉంది.

అయితే తాజా యాషెస్‌ సిరీస్‌లో టిమ్‌ పైనీ నేతృత్వంలోని ఆసీస్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలి టెస్టును ఆసీస్‌ గెలవగా, రెండో టెస్టు డ్రా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్‌, నాల్గో టెస్టులో ఆసీస్‌లు విజయం సాధించాయి. దాంతో ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ఇక చివరి టెస్టును ఆసీస్‌ గెలిస్తే పైన్‌ అరుదైన ఘనతను లిఖిస్తాడు.  అదే సమయంలో సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ను గెలవలేకపోతున్న అపవాదుకు కూడా బ్రేక్‌ పడుతుంది.  2010లో ఆసీస్‌ తరఫున అరంగేట్రం చేసిన పైన్‌.. ప్రధానంగా టెస్టుల్లోనే కనిపిస్తాడు. ఇప్పటివరకూ ఆసీస్‌ జట్టుకు అడపా దడపా కెప్టెన్‌గా వ్యవహరించిన పైన్‌.. యాషెస్‌ సిరీస్‌ కూడా కెప్టెన్‌గా నియమించింది క్రికెట్‌ ఆస్ట్రేలియా.

బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కోవడంతో వారిని ఆసీస్‌ యాషెస్‌ జట్టుకు కెప్టెన్లుగా నియమించడానికి సీఏ మొగ్గు చూపలేదు. ఆ క్రమంలోనే పైన్‌ కెప్టెన్‌గా ఎంపిక కావడానికి మార్గం సుగమం అయ్యింది. ఇలా యాక్సిడెంటల్‌గా ఆసీస్‌కు సారథిగా ఎంపికైన పైన్‌.. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో రాణించలేదు. కాకపోతే కెప్టెన్‌గా మాత్రం ఒక మైలురాయిని చేరుకునేందుకు చేరవయ్యాడు. గురువారం నుంచి కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జరుగనున్న చివరిదైన ఐదో యాషెస్‌ టెస్టును ఆసీస్‌ గెలిస్తే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఫలితంగా ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ సిరీస్‌లు గెలిచిన కొద్ది మంది ఆసీస్‌ కెప్టెన్ల జాబితాలో పైన్‌ చోటు సంపాదిస్తాడు. మరి ఈ అరుదైన ఫీట్‌ను పైన్‌ సాధిస్తాడో లేదో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement