తుది జట్టును మార్చరా?
మిర్పూర్: అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికీ తుది జట్టులో మార్పులు ఎందుకు చేయలేదని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్తవారికి అవకాశం ఇస్తే జట్టులోని పాత ఆటగాళ్ల స్థానాలకు ముప్పు వస్తుందని టీమ్ మేనేజ్‌మెంట్ భయపడుతోందన్నారు.
‘రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు రాణిస్తే వేరే వాళ్లకు ఇబ్బందులు తప్పవు. అందుకే మేనేజ్‌మెంట్ మార్పులు చేసేందుకు అలసత్వం ప్రదర్శిస్తోంది. ఎలా ఆడినా సరే జట్టులో మాత్రం చోటు ఉండాల్సిందేనని కొంత మంది ఆటగాళ్లు భావిస్తున్నారు. పుజారా పరుగులు చేసినా, పాండే వికెట్లు తీసినా.. మేనేజ్‌మెంట్ ఫేవరెట్ బ్యాట్స్‌మన్, బౌలర్‌లను తప్పించాల్సి వస్తుంది.
అందుకే మార్పులకు భయపడుతున్నారు’ అని ఈ మాజీ కెప్టెన్ విమర్శించారు. భారత జట్టు నిర్ణయాలను అవగాహన చేసుకోవడం చాలా కష్టమన్నారు. నిజాయితీగా చెప్పాలంటే వాళ్ల నిర్ణయాలు తికమకపెడుతున్నాయన్నారు.
విశ్రాంతి ఇవ్వాలి...
నాన్ స్టాప్‌గా క్రికెట్ ఆడుతున్న కొంత మంది ఆటగాళ్లకు టి20 ప్రపంచకప్‌కు ముందు కాస్త విశ్రాంతి ఇవ్వాలని గవాస్కర్ సూచించారు. రిజర్వ్ బెంచ్‌కు అవకాశాలు ఇవ్వకుంటే వాళ్లు ఇంకెప్పుడు ఆడతారని ప్రశ్నించారు. ‘ఈశ్వర్ పాండే న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. జింబాబ్వే టూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పుజారాకు ఆ తర్వాత అవకాశమే ఇవ్వలేదు’ అని గవాస్కర్ అన్నారు. మరోవైపు జట్టులో మార్పులు చేయకపోవడాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి సమర్థించుకున్నాడు. ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసం పెరగాలంటే ఒకే రకమైన టీమ్ ఉండటం మంచిదన్నాడు. సంధి కాలాన్ని ఎదుర్కొంటున్న వన్డే జట్టు ఆసియా కప్‌లో పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని చెప్పాడు.