
సాక్షి, హైదరాబాద్: ‘నేనెప్పుడైనా పొదుపుగా బౌలింగ్ చేసి బయట పడిపోవాలని ప్రయత్నించను... నా చేతిలో బంతి ఉందంటే వికెట్లు తీయడంపైనే దృష్టి పెడతా’... ఇటీవల తన బౌలింగ్ గురించి ఉమేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. అతని బౌలింగ్ పదును ఏమిటో తాజాగా హైదరాబాద్ టెస్టులో కనిపించింది. జీవం లేని భారత పిచ్‌లపై ఒక ఫాస్ట్ బౌలర్ టెస్టుల్లో దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం అంత సులువు కాదు. విదేశాల్లో మన పేసర్లు చెలరేగిపోవడం కూడా కొత్త కాదు. కానీ సత్తా ఉంటే భారత్‌లో కూడా పేసర్లు సత్తా చాటగలరని ఉమేశ్ నిరూపించాడు. బౌన్స్‌కు అనుకూలించిన ఉప్పల్ పిచ్‌పై అతను చక్కటి ఫలితం రాబట్టాడు.
భారత్‌లో 5 వికెట్లు, 10 వికెట్లు తీసిన బౌలర్ అంటే ఏ అశ్వినో, జడేజానో అని అలవాటుగా మారిపోయిన అందరికీ నేనున్నానని ఉమేశ్ గుర్తు చేశాడు. స్వదేశంలో 19 ఏళ్ల తర్వాత 10 వికెట్ల ఘనత సాధించిన పేసర్‌గా కపిల్, శ్రీనాథ్‌ల సరసన నిలిచాడు. సొంతగడ్డపై వచ్చేసరికి భారత ప్రధాన పేసర్‌గా ఉమేశ్‌కే ఎక్కువ అవకాశాలు దక్కాయి. ఆగస్టు 2016 నుంచి భారత్ ఇక్కడ 18 టెస్టులు ఆడితే అతను 17 ఆడాడు. సొంతగడ్డపై తన ఎంపికకు ప్రతీసారి న్యాయం చేశాడు. మొత్తంగా భారత్‌లో 24 టెస్టుల్లో ఉమేశ్ పడగొట్టిన 73 వికెట్లలో 38 బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూలే ఉన్నాయి.
ఇది అతని బౌలింగ్ సత్తాను చూపించింది. హైదరాబాద్ టెస్టులో ఉమేశ్ ప్రదర్శన అతని కఠోర శ్రమకు, పట్టుదలకు నిదర్శనం. భారత్‌లో గత రెండేళ్లుగా అద్భుతమైన రికార్డు ఉన్నా విదేశాలకు వెళ్లేసరికి అతనికి తుది జట్టులో స్థానం లభించడమే గగనంగా మారిపోయింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో కలిపి ఎనిమిది టెస్టుల్లో అతనికి రెండు మ్యాచ్‌లు మాత్రమే లభించాయి. సుదీర్ఘ కాలంగా జట్టుతో ఉన్నా ఇషాంత్, షమీ, భువనేశ్వర్‌ల తర్వాతే అతనికి అవకాశం దక్కేది. ఇప్పుడు పైజాబితాలో బుమ్రా కూడా చేరడంతో ఉమేశ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అయితే దీనికి అతను కుంగిపోలేదు. ఏ దశలోనూ సహనం కోల్పోని ఉమేశ్... ‘వారంతా బాగా ఆడుతుంటే నేను చోటు ఆశించడం తప్పు.
నాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం చెలరేగాల్సిందే’ అంటూ నిజాయితీగా వ్యాఖ్యానించాడు. వరుసగా అవకాశాలు దక్కకపోయినా... ఎప్పుడో ఒకసారి మ్యాచ్ అవకాశం దక్కినా 100 శాతానికి పైగా శ్రమిస్తూ పూర్తి ఉత్సాహంతో బౌలింగ్ చేయడం ఉమేశ్‌కు బాగా తెలుసు. రెండో టెస్టులో శార్దుల్ గాయంతో సింగిల్ హ్యాండ్ పేసర్‌గా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఒక రోజులో భారత గడ్డపై ఒక పేసర్ ఏకంగా 23 ఓవర్లు బౌలింగ్ చేయడం అసాధారణం. కానీ ఉమేశ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇది అతని ఫిట్‌నెస్ సామర్థ్యానికి సూచిక. అతని 118 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్‌లో ఇదే మొదటి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కావడం విశేషం. వేగానికి స్వింగ్ జోడిస్తే ఆ బౌలింగ్‌కు ఏ ఫార్మాట్‌లోనైనా తిరుగుండదని నమ్మే ఉమేశ్ ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై అత్యంత కీలకంగా మారతాడనడంలో సందేహం లేదు. 2012లో పెర్త్ వికెట్‌పై ఐదు వికెట్లు తీసిన అతను ఈసారి మరింత జోష్‌తో అక్కడికి వెళ్లడం ఖాయం.
పదో వికెట్ కోసం...
విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్ ఉమేశ్ వేశాడు. అప్పటికే విండీస్ 6 వికెట్లు కోల్పోతే అతను 3 వికెట్లు తీశాడు. అయితే తర్వాతి 13 ఓవర్లు స్పిన్నర్లే వేశారు. విండీస్ 9 వికెట్లు కోల్పోయిన దశలో 47వ ఓవర్ జడేజా వేయడానికి సిద్ధమయ్యాడు. బంతిని తీసుకొని ఇక ఓవర్ మొదలు పెట్టడమే ఆలస్యం. అయితే అప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టని కోహ్లికి ఒక్కసారిగా ఉమేశ్ పదో వికెట్ ఘనత గుర్తుకొచ్చినట్లుంది. దాంతో జడేజా నుంచి బంతి తీసుకొని లాంగాన్‌లో ఉన్న ఉమేశ్‌ను పిలిచాడు. జడేజా కూడా నవ్వుతూ అతని భుజం చరిచి బెస్టాఫ్ లక్ చెప్పాడు. ఒకే ఒక్క బంతి... అంతే గాబ్రియెల్ క్లీన్ బౌల్డ్, ఉమేశ్ కెరీర్‌లో తొలిసారి 10 వికెట్ల ఘనత.. సహచరులంతా గట్టిగా అభినందిస్తూ అతని జుట్టు ముడి తీసి సరదాగా నవ్వుతుండగా ఉమేశ్ సగర్వంగా పెవిలియన్ వైపు చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment