
విరాట్ సేనను ఆపతరమా?
ఇప్పటికే ఇంగ్లండ్తో సుదీర్థ టెస్టు సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. ఇప్పుడు మరో విజయంపై కన్నేసింది.
చెన్నై:ఇప్పటికే ఇంగ్లండ్తో సుదీర్థ టెస్టు సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. ఇప్పుడు మరో విజయంపై కన్నేసింది. శుక్రవారం నుంచి నగరంలోని చిదంబరం స్టేడియంలో ఆరంభం కానున్న చివరిదైన ఐదో టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఉదయం గం.9.30 భారత్-ఇంగ్లండ్ ల మధ్య ఐదో టెస్టు ఆరంభం కానుంది. అయితే వరస నాలుగు టెస్టులను చూస్తే, తొలి టెస్టు మినహా మిగతా మ్యాచ్ల్లో టీమిండియా హవానే పూర్తిగా కొనసాగింది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు ఎటువంటి అవకాశం ఇవ్వని విరాట్ సేన ఘనమైన విజయాలను నమోదు చేసింది. ఈ నాలుగు టెస్టుల్లో మూడుసార్లు టాస్ ఓడిపోయిన విరాట్ సేన.. సమష్టిగా రాణించి ఇంగ్లండ్కు షాకిచ్చింది. ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో భారత్ బరిలోకి దిగుతుండగా, కనీసం ఒక మ్యాచ్ గెలిచి పరువు నిలుపుకోవాలని యోచనలో ఇంగ్లండ్ పోరుకు సన్నద్ధమవుతోంది.
చెన్నైలో తిరుగులేని భారత్
ఇక్కడ ఇప్పటివరకూ 31 టెస్టు మ్యాచ్లో జరగ్గా, అందులో భారత్ 13 మ్యాచ్లో గెలిచి 11 మ్యాచ్లను డ్రా చేసుకుంది. ఇందులో ఆరు మ్యాచ్ల్లో ఓటమి పాలుకాగా ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది. ఇదిలా ఉంచితే ఇక్కడ భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఎనిమిది టెస్టులు జరిగాయి. అందులో భారత్ నాలుగు మ్యాచ్ల్లో గెలవగా, ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది. మిగతా మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. 2008లో ఇరు జట్ల మధ్య చివరి టెస్టు జరగ్గా అందులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ స్టేడియంలో 2013లో ఆస్ట్రేలియాతో చివరిసారి భారత్ తలపడింది. అక్కడ కూడా భారత్ నే విజయం వరించింది. ఆ మ్యాచ్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మనీష్ పాండేకు అవకాశం!
ఇప్పటికే భారత్ సిరీస్ ను దక్కించుకోవడంతో ఎంతోకాలం నుంచి టెస్టు అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న టాపార్డర్ ఆటగాడు మనీష్ పాండే కు ఇంగ్లంతో చివరి టెస్టులో అవకాశం దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. గత టెస్టులో మనీష్ పాండేకు జట్టు ప్రాబబుల్స్ ను చోటు కల్పించినా, తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. అజింక్యా రహానేకు విశ్రాంతినివ్వడంతో మనీష్ కు చోటు దక్కుతుందని భావించారు. కాగా, కరణ్ నాయర్ కు మరోసారి తుది జట్టులో అవకాశం ఇవ్వడం ద్వారా మనీష్ను పక్కకు పెట్టకతప్పలేదు. కాగా, ఈ సిరీస్ లో రెండు టెస్టు మ్యాచ్లు ఆడిన కరణ్ 4,13 స్కోర్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో మనీష్ పాండే ఎంపిక దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.
తుది జట్టు(అంచనా): విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, చటేశ్వర పూజారా, మనీష్ పాండే, పార్థీవ్ పటేల్, అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్