చెన్నై:భారత్ తో చివరి టెస్టు ఆఖరి రోజు ఆటలో లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 97/0. దాంతో మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందని అంతా భావించారు. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. లంచ్ తరువాత రెండో సెషన్లో నాలుగు వికెట్లు సాధించి ఆధిక్యంలో నిలిచిన విరాట్ సేన.. మూడో సెషన్లో ఇంగ్లండ్ భరతం పట్టింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా విజృంభించి ఏడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, మిగతా పనిని ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్లు పూర్తి చేశారు. దాంతో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో తమకు తిరుగులేదని నిరూపించింది. తద్వారా సిరీస్ను భారత్ 4-0 గెలుచుకుని ఇంగ్లండ్ కు నిరాశను మిగిల్చింది. ఇంకా ఈ రోజు ఆటలో దాదాపు 7.0 ఓవర్లు ఉండగానే భారత్ సంచలన విజయం సాధించడం ఇక్కడ విశేషం.
12/0 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం ఆఖరి రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ కు మంచి ఆరంభమే లభించింది. కెప్టెన్ అలెస్టర్ కుక్(49), జెన్నింగ్స్(54)లు బాధ్యతాయుతంగా ఆడారు. ప్రధానంగా ఈ ఇద్దరూ తొలి సెషన్లో వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. తొలి వికెట్ కు 103 పరుగులు జోడించి సమయోచిత ఆట తీరు ప్రదర్శించారు. కాగా, రెండో సెషన్ లో ఇంగ్లండ్ పతనం ఆరంభమైంది. కుక్ ను తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపిన జడేజా.. ఆపై స్వల్ప వ్యవధిలో జెన్నింగ్స్ ను అవుట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత 19 పరుగుల వ్యవధిలో రూట్ ను జడేజా అవుట్ చేయగా, బెయిర్ స్టోలను ఇషాంత్ శర్మ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మొయిన్ అలీ(44), బెన్ స్టోక్స్(23)లు పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 63 పరుగులను జోడించడంతో ఇంగ్లండ్ తిరిగి గాడిలో పడినట్లు కనబడింది.
కాగా, 192 పరుగుల వద్ద అలీని జడేజా ఐదో వికెట్ గా అవుట్ చేయడంతో ఇక ఇంగ్లండ్ తేరుకోలేదు. పరుగు వ్యవధిలో స్టోక్స్ ను జడేజా అవుట్ చేసి ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. ఆపై కాసేపటికి డాసన్(0)ను అమిత్ మిశ్రా అవుట్ చేయగా, రషిద్(2)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. అయితే జాస్ బట్లర్-స్టువర్ట్ బ్రాడ్లు కాసేపు భారత్ బౌలింగ్ ను ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. తొలుత ఈ జోడిలో బ్రాడ్ ను జడేజా అవుట్ చేయగా, ఆ తరువాత వెంటనే బాల్ కూడా జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు. దాంతో భారత్ ఖాతాలో అపూర్వమైన విజయం చేరింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరుణ్ నాయర్ కు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్ కోహ్లికి లభించింది. ఇది భారత్ కు వరుసగా 18 వ టెస్టు విజయం కావడం మరొక విశేషం కాగా, 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 477 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 207 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 759/7