
కొడుకు దగ్గర కోట్లున్నా... తండ్రి మాత్రం కాఫీషాప్‌లోనే!
సాక్షి క్రీడావిభాగం: రికార్డుల రారాజు... ప్రపంచంలోనే అతి గొప్ప అథ్లెట్... కాలు కదిపితే కనకవర్షం... కోట్లు కుమ్మరిస్తున్న స్పాన్సర్లు... ఇదీ ప్రస్తుతం ఉసేన్ బోల్ట్ పరిస్థితి. కానీ చిన్నప్పుడు బోల్ట్ కూడా పేదరికాన్ని అనుభవించాడు. అతడి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ దిగ్గజాన్ని పెంచారు. ఉసేన్ బోల్ట్ చరిత్ర ఆసక్తికరం...
జమైకాలోని ట్రెలానీ అనే చిన్న గ్రామం... బోల్ట్ తండ్రి వెలస్లీ ట్రైలానీ సమీపంలోని ఒక పట్టణంలోని కాఫీ షాప్‌లో పనిచేసేవారు. తన జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. కానీ వెలస్లీ తన బాధలను పిల్లలకు తెలియనీయలేదు. ఉన్న డబ్బునే సర్ది పిల్లల సరదాలు, కోరికలు తీర్చేవారు. అదే సమయంలో డబ్బు కోసం తప్పుడు మార్గాలు అన్వేషించకూడదంటూ పిల్లలకు చెప్పేవారు.
ఆ ప్రాంతంలో దొంగలు ఎక్కువ. చిన్నప్పుడే పిల్లలు నేరాల బాట పట్టేవారు. చుట్టూ అలాంటి వాళ్లు చాలామంది ఉన్నా... తన పిల్లలు ముగ్గురినీ మాత్రం క్రమశిక్షణతో పెంచారు ఆయన. స్థానికంగా ఉండే రాజకీయాల ప్రభావం కూడా తన పిల్లలపై పడకుండా చూశారు. ‘చిన్నతనంలో మా దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది కాదు. అయితే దాని కోసం ఎప్పుడూ బాధ పడలేదు. నువ్వు కూడా కష్టపడితేనే ఎవరి సహాయం లేకుండా బతకవచ్చు. డబ్బు కోసం ఎప్పుడూ తప్పుడు మార్గాల్లోకి వెళ్లకు... అని నాన్న చెప్పేవారు’ అని బోల్ట్ తన జీవిత చరిత్ర ‘ఉసేన్ బోల్ట్ - మైస్టోరీ’ పుస్తకంలో రాశాడు. చిన్ననాటినుంచి కుటుంబ విలువలు, క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం... ఇవన్నీ తనను తీర్చిదిద్దాయని అతను చెప్పుకున్నాడు. సాధారణ కుర్రాడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం ఏదో అదృష్టవశాత్తూ జరిగింది కాదని... తండ్రి పెంపకమే తన విజయాలను రచించిందని బోల్ట్ మనసులో మాట వెల్లడించాడు.
అథ్లెటిక్స్ ఎందుకంటే...
పాఠశాల విడిచిపెట్టగానే అందరికంటే ముందు ఇల్లు చేరేది ఎవరంటే మరో మాట లేకుండా బోల్ట్ అని సహచరులు చెబుతారు. స్కూల్‌లో అందరికంటే వేగంగా పరిగెడతాడని అతనికి పేరుండేది. అయితే ఆ కారణంగా తాను అథ్లెట్ కావాలనుకోలేదని బోల్ట్ అంటాడు. ‘టీమ్ గేమ్ అయితే రాజకీయాలు ఉంటాయి. బాగా ఆడినా అవకాశం దక్కకపోవచ్చు. అదే అథ్లెటిక్స్‌లో అయితే నువ్వు బెస్ట్ అవుతావు లేదా నీకు చేత కాదు. నీ సత్తా ఏమిటో గడియారం మాత్రమే చెప్పగలదు’ చిన్నప్పుడు తండ్రి బోల్ట్‌కు చేసిన మార్గనిర్దేశం ఇది. ఎందుకొచ్చిన పరుగు అంటూ తల్లి జెన్నీఫర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా... తండ్రి వెలస్లీ మాత్రం కొడుకు పరుగు కోసం తాను పరుగులు తీశారు.
ఇప్పటికీ అదే పనిలో...
బోల్ట్ ఇప్పుడు కోట్ల డాలర్లు సంపాదిస్తున్నాడు. కూర్చుని తిన్నా మూడు తరాలకు సరిపడా ఆస్తులు వచ్చేశాయి. కానీ ఇప్పటికీ బోల్ట్ తల్లిదండ్రులు జెన్నీఫర్, వెలస్లీ కొడుకు దగ్గరకు రాలేదు. తమ గ్రామంలోనే ఉంటున్నారు. అంతేకాదు... వెలస్లీ ఇప్పటికీ అదే కాఫీషాప్‌లో పని చేస్తున్నారు. ‘మా సొంత ఊరు ట్రెలానీ నుంచి, మా సమాజం నుంచి వారు ఎప్పుడూ బయటికి రావాలని భావించలేదు. చివరకు ఊర్లో ఇల్లు బాగు చేసుకోవడానికి మాత్ర మే నేను డబ్బు ఖర్చు చేశాను’ అని బోల్ట్ ఉద్వేగంగా అన్నాడు. ఇప్పటి వరకు తండ్రి తనని ఏమీ అడగలేదని, ఏదైనా ఇవ్వాలనుకున్నా వద్దంటాడని చెప్పాడు. ‘తన ఉద్యోగం చేసుకోవడం తప్ప నాన్న ఏమీ అడగలేదు. బహుశా అడగరు కూడా. అమ్మ కూడా అంతే. మహా అయితే నా దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి కింగ్‌స్టన్ నుంచి ట్రెలానీకి వెళ్లడానికి బస్ చార్జీలు మాత్రం అడుగుతుందేమో’ అని బోల్ట్ చెప్పాడు. జమైకా లాంటి దేశం నుంచి బోల్ట్ లాంటి పెద్ద అథ్లెట్ ఈరోజు ప్రపంచానికి లభించాడంటే కారణం అతడి తల్లిదండ్రుల ‘పెంపకమే’. వారికి హ్యాట్సాఫ్..!