బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర రెడ్డి
శాట్స్ చైర్మన్‌గా నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్‌గా అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, శాట్స్ అధికారులు, క్రీడాభిమానులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాట్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర రెడ్డిని పలువురు ఘనంగా సన్మానించారు. గ్రామాల్లోని యువత క్రీడల్లో రాణించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పంజాబ్, హరియాణా తరహాలో రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో క్రీడాకారుల కోసం హాస్టల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, పద్మారావు గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బాల్క సుమన్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, గువ్వల బాలరాజు, ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీలు కాశిరెడ్డి నారాయణ రెడ్డి, శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు శాట్స్ సిబ్బంది పాల్గొన్నారు.