
వారెవ్వా... విజేందర్
భారత బాక్సర్ శుభారంభం
అరంగేట్రంలోనే అదుర్స్
ప్రొఫెషనల్ కెరీర్‌లో తొలి గెలుపు
వైటింగ్‌పై టెక్నికల్ నాకౌట్ విజయం
మాంచెస్టర్ సిటీ: అమెచ్యూర్ బాక్సింగ్‌ను వదిలి ప్రొఫెషనల్ కెరీర్‌లో అడుగుపెట్టాలని తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ నిరూపించాడు. తన ప్రొఫెషనల్ కెరీర్‌లో బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే ఈ హరియానా బాక్సర్ విజయం రుచి చూశాడు. అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. బ్రిటన్ బాక్సర్ సన్నీ వైటింగ్‌తో శనివారం రాత్రి జరిగిన మిడిల్‌వెయిట్ బౌట్‌లో విజేందర్ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో జయభేరి మోగించాడు. మూడు నిమిషాల నిడివి గల నాలుగు రౌండ్‌లు జరగాల్సిన బౌట్ విజేం దర్ ధాటికి మూడో రౌండ్‌లోనే ముగిసింది.
బౌట్‌కు ముందు తన మాటలతో చెలరేగినవైటింగ్ రింగ్‌లో మాత్రం విజేందర్ పంచ్‌ల వర్షానికి తట్టుకోలేకపోయాడు. మూడో రౌండ్‌లో రెండున్నర నిమిషాలకే చేతులెత్తేశాడు. విజేందర్ పంచ్‌ల ధాటికి వైటింగ్ తాళలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. పక్కా ప్రణాళికతో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన విజేందర్ మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థి వైటింగ్‌పై ఆధిపత్యం చలాయించాడు.ఈనెల 30న విజేందర్ తన రెండో ప్రొఫెషనల్ బౌట్‌లో తలపడతాడు. ‘ప్రొఫెషనల్ బాక్సింగ్ నాకు కొత్తది. దీని కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇది ఆరంభం మాత్రమే. నన్ను ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు’ అని బౌట్ అనంతరం విజేందర్ వ్యాఖ్యానించాడు.