'ఇది నోట్ల రద్దు కంటే పెద్ద నిర్ణయం' | Virat Kohli And Ravi Shastri Are Getting Trolled For Dropping Bhuvneshwar Kumar | Sakshi

'ఇది నోట్ల రద్దు కంటే పెద్ద నిర్ణయం'

Published Sat, Jan 13 2018 2:56 PM | Last Updated on Sat, Jan 13 2018 3:00 PM

Virat Kohli And Ravi Shastri Are Getting Trolled For Dropping Bhuvneshwar Kumar - Sakshi

సెంచూరియన్‌:దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న కీలకమైన రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేయడం విమర‍్శలకు దారితీసింది. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆరు వికెట్లు(రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) సాధించి సఫారీలను వణికించిన భువీని రెండో టెస్టు నుంచి తప్పించడం వెనుక పరమార్థం ఏమిటని అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే ఇషాంత్‌ను తుది జట్టులోకి తీసుకోవడాన్ని సమర్ధిస్తూనే భువీకి విశ్రాంతి ఇవ్వడాన్ని మేనేజ్‌మెంట్‌ ప్రణాళిక లోపంగా అభిప్రాయపడుతున్నారు. ఇది నోట్ల రద్దు నిర్ణయం కంటే అతి పెద్ద  నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.

'ఇషాంత్‌ శర్మ మంచి బౌలరే.. ఈ మ్యాచ్‌లో ఒక అత్యుత్తమ స్పెల్‌తో ఇషాంత్‌ ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది.  ఇక్కడ భువీని పక్కకు తప్పించి.. ఇషాంత్‌కు ఎందుకు అవకాశాన్ని కల్పించారో అర్థం కావడం లేదు. భువీకే  విశ్రాంతి ఎందుకు?.. ఇక్కడ బూమ్రాకు ఎందుకు విశ్రాంతి ఇవ్వకూడదు' అని ఒక అభిమాని ప్రశ్నించాడు. 'జట్టు ఎంపిక విషయంలో మేనేజ్‌మెంట్‌ గందరగోళానికి లోనైనట్లు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భువీ తుది జట్టులో లేకపోవడం నోట్ల రద్దు కంటే పెద్ద నిర్ణయం ' అని సదరు అభిమాని సెటైర్‌ వేశాడు. టీమిండియా ఎలెవన్‌లో భువీ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, గత మ్యాచ్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌ను తప్పించారు' అని మరొక క్రికెట్‌ ఫ్యాన్‌ ఎద్దేవా చేశాడు.  అదే సమయంలో రహానేకు ఈ టెస్టులో సైతం అవకాశం ఇవ్వకపోవడాన్ని కూడా అభిమానులు తప్పుబడుతున్నారు. బౌన్సీ ట్రాక్‌లపై మంచి రికార్డు ఉన్న రహానే ఫామ్‌ను పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమంటున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement