మిచెల్ చూడూ.. కోహ్లి ఎంత కసిగా కొట్టాడో!
న్యూఢిల్లీ: కీలక సమయాల్లో విరాట్ కోహ్లి ఆడలేడు. అందుకు ఉదాహరణ 2015 వరల్డ్ కప్ సెమిస్ మ్యాచే. ఆస్ట్రేలియా విసిరిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో విరాట్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. భారత్ ఓడిపోయింది... అంటూ ఎద్దేవాపూరిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్‌కు డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తన బ్యాటుతో దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు.
ఒత్తిడిలో కోహ్లి ఆడలేడన్న మిచెల్ విమర్శలను తుత్తునియలు చేస్తూ.. అత్యంత ఒత్తిడిలో ఎంతో స్థిరచిత్తంతో ఆస్ట్రేలియాపై విరాట్ మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్లలో అతడు ఆడుతుంటే.. ఆస్ట్రేలియా బౌలర్లు, ఫీల్డర్లు బిత్తరపోయారు. అతని ధాటికి బంతులు ఎక్కడ వేయాలో తెలియక కంగారులు కంగారెత్తారు. బౌలర్లు చక్కటి బంతులు వేసినా కళాత్మక విధ్వంసంతో ఆసిస్‌ను చిత్తు చేశాడు కోహ్లి. కోహ్లి ఆటతీరుపై ఇప్పుడు భారత్‌లోనే కాదు.. క్రికెట్ ప్రపంచంలోనే ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ దిగ్గజాలు, తాజా మాజీ ఆటగాళ్లు కోహ్లి మాస్టర్ ఇన్నింగ్స్‌ను కీర్తిస్తున్నారు. ఇదే సమయంలో కోహ్లి అభిమానులు మిచెల్‌కు సోషల్ మీడియాలో చురకలు వేస్తున్నారు. మీ జట్టుకు కోహ్లి ఎలా చుక్కులు చూపాడో చూశావా? మిచెల్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. సవాల్‌నే సవాలుగా తీసుకొని ఆడే కోహ్లి ముందు నీ కుప్పిగంతుల విమర్శలు పనిచేయబోవని మిచెల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా జాన్సన్ ఆదివారం ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కంగారులు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి స్లెడ్జింగ్‌లాంటి దానికి పాల్పడితే.. దానిని పాజిటివ్ తీసుకొని మరింత స్ఫూర్తి పొందుతానని చెప్పాడు. కోహ్లి వ్యాఖ్యలను మిచేల్ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశాడు. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ సెమిస్ మ్యాచ్‌లో ఎందుకు విఫలమయ్యావంటూ ప్రశ్నించాడు. నిజంగా ఆడాల్సిన ఆ సమయంలో ఒక్క పరుగుకే ఔటైన విషయాన్ని పరోక్షంగా గుర్తుచేసిన సంగతి తెలిసిందే.