
లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసిన విరాట్
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తాజాగా అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు.
ముంబై: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ ' ఇంటి' వాడయ్యాడు. తాజాగా అత్యంత విలాసవంతమైన ఓ అపార్ట్ మెంట్ ను విరాట్ తాజాగా కొనుగోలు చేసి ఇంటివాడయ్యాడు. ముంబై నగరంలో వార్లీ ప్రాంతంలో ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ సూపర్ లగ్జరీ ప్రాజెక్ట్ టవర్ -సిలో 35వ అంతస్తును విరాట్ కొనుగోలు చేశాడు. సుమారు 7,171 చదరపు అడుగుల వైశాల్యం గల అపార్ట్ మెంట్ విలువ రూ. 34 కోట్లు.
గత కొన్ని నెలల నుంచి ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ తో చర్చలు సాగించిన పిదప విరాట్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు. అయితే విరాట్ ఖరీదు చేసిన ఈ అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఐదు బెడ్ రూమ్లను కల్గి ఉండటమే కాకుండా, నేరుగా సముద్రాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఇక్కడ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయాలని విరాట్ గతేడాదే ఫిక్సయ్యాడట. దానిలో భాగంగానే 2015లో ఈ సైట్ను గర్ల్ ఫ్రండ్ అనుష్క శర్మతో కలిసి విరాట్ వీక్షించాడు. ఇదిలా ఉండగా మరో క్రికెటర్ యువరాజ్ సింగ్కు కూడా గతంలో ఇదే టవర్-సిలో ఓ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయడం విశేషం. 2014లో 29వ అంతస్తును యువరాజ్ సింగ్ ఖరీదు చేశాడు.