ఈ ఇద్దరు... ‘ఆ ఇద్దరు’ కాలేరా!
నమ్మకం నిలబెట్టలేని కోహ్లి, పుజారా
- ఇంగ్లండ్‌లో ఘోర వైఫల్యం
- జట్టుపై తీవ్ర ప్రభావం
భారత క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు తప్పుకుంటే వారి స్థానాలను సరిగ్గా భర్తీ చేయగల ఆటగాళ్లుగా అందరూ ముక్తకంఠంతో అంగీకరించిన పేర్లు విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా. అందులోనూ టెస్టుల్లో ఆయువుపట్టులాంటి మూడు, నాలుగు స్థానాలను వీరిద్దరు మరో చర్చకు అవకాశం లేకుండా సొంతం చేసుకున్నారు. అందుకు తగ్గట్లే సచిన్‌ను మరిపిస్తూ అద్భుతమైన వన్డే ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లి టెస్టుల్లోనూ స్థిరపడితే... ద్రవిడ్ తరహాలో సాంకేతికంగా అసలైన టెస్టు బ్యాట్స్‌మన్ తరహాలో పుజారా కూడా జట్టులో నిలబడ్డాడు. అయితే ఇప్పుడు ఇంగ్లండ్‌లో పరిస్థితి అంతా తలకిందులుగా కనిపిస్తోంది. కోహ్లి, పుజారా ఆటను చూస్తే నాటి దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేరా అనే సందేహమూ వస్తోంది. - సాక్షి క్రీడావిభాగం
ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో 8 పరుగులకు 3 వికెట్లు పడ్డ సమయంలో ద్రవిడ్‌లాగే పుజారా ఆపద్బాంధవుడవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ స్థితిలో పుజారా తన శరీరానికి దూరంగా షాట్ ఆడి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం నివ్వెర పరచింది. సాంకేతికంగా అత్యున్నత ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను ఇలా అవుట్ కావడం అనూహ్యం. ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెడుతున్నప్పుడు ఎవరు ఆడినా, ఆడకున్నా తన టెక్నిక్‌తో పుజారా నిలబడగలరని భావించారు. వాండరర్స్, డర్బన్‌లలో చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన అనంతరం పుజారా ఆట గతి తప్పింది. ఈ ఏడాది 6 టెస్టుల్లో 12 ఇన్నింగ్స్‌లలో పుజారా 22.25 సగటుతో 267 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే అర్ధ సెంచరీ ఉంది. పసలేని నాటింగ్‌హామ్ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 55 పరుగులు మినహా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జట్టుకు అతను బలం కాలేకపోయాడు. సాంకేతికంగాకంటే పుజారా సమస్య మానసికమైందని మాజీ క్రికెటర్ల అభిప్రాయం.
మనిషి క్రీజ్‌లో... మనసు ఎక్కడో!
‘ఇంగ్లండ్‌లాంటి చోట ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’... ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. జట్టులో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న గుర్తింపుతో కావచ్చు లేదా అంతకు ముందు జొహన్నెస్‌బర్గ్, వెల్లింగ్టన్‌లలో చేసిన అద్భుతమైన సెంచరీలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కావచ్చు కోహ్లి ఈ మాటలు అన్నాడు. అయితే ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ముగిశాక కోహ్లి ఆట చూస్తే ఇది అతిగానే తోస్తుంది. 1, 8, 25, 0, 39, 28, 0, 7... ఇవీ అతను చేసిన స్కోర్లు. అతను పదే పదే అవుటవుతున్న తీరు చూస్తే ఏకాగ్రత లేనట్లే అనిపిస్తోంది.
ఆఫ్‌స్టంప్ బయట పడి దూరంగా వెళుతున్న బంతులను వదిలేయకుండా వెంటాడి అవుట్ కావడం ఒక అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ స్థాయికి తగింది కాదు. ఆ సమయంలో చూపించాల్సిన ఓపిక, సహనం అతనిలో కనిపించడం లేదు. జొహన్నెస్‌బర్గ్‌లో ఇలాంటి స్థితిలోనే అతను పరిపక్వత ప్రదర్శించాడు. బంతి అద్భుతంగా స్వింగ్ అవుతున్నప్పుడు తొలి సెషన్‌లో మొదటి 28 బంతుల్లో 16... రెండో సెషన్‌లో తొలి 17 బంతుల్లో 11 బంతులను కనీసం టచ్ కూడా చేయకుండా వదిలేశాడు. ఆ తర్వాత నిలదొక్కుకొని చక్కటి సెంచరీకి బాట పరచుకున్నాడు.
ఇంగ్లండ్‌లో మాత్రం ఏదో తొందర ఉన్నట్లు అలా స్లిప్స్‌లోకి తోసి పెవిలియన్ వెళ్లిపోతున్నాడు! ‘అతని వన్డే ఇన్నింగ్స్‌లు చూస్తే నేరుగా వచ్చే బంతులను ప్యాడ్స్ మీదుగా అద్భుతంగా ఆడతాడు. కాబట్టి వికెట్లకు దగ్గరగా బౌలింగ్ చేయకూడదు. అందుకే ఆఫ్ స్టంప్ బయటే బంతులు విసురుతున్నాం’ అని చెప్పిన ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్, అండర్సన్ తోడుగా అదే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశాడు. ఈ సిరీస్‌లో అండర్సన్ బౌలింగ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న విరాట్, ఏడు పరుగులు మాత్రమే చేసి నాలుగు సార్లు అవుటయ్యాడు. ‘సచిన్ తర్వాతి సచిన్ అనిపించుకోవడం అంత సులువు కాదు. ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌గా ఎదగాలంటే విదేశాల్లో భారీగా పరుగులు చేయాల్సిందే’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన సూచన ఈ సందర్భంగా సరిగ్గా సరిపోతుంది.