విరాట్ కోహ్లి మరో ఫీట్
హైదరాబాద్:టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో సరికొత్త మైలురాయిని సాధించాడు. తొలి రోజు ఆటలో భాగంగా గురువారం బంగ్లాదేశ్ పై సెంచరీ సాధిండం ద్వారా తాను ఆడిన ప్రతీ టెస్టు హోదా దేశంపై శతకాలు సాధించిన ఘనతను సాధించిన కోహ్లి.. తాజాగా ఒక స్వదేశీ సీజన్ లో అత్యధిక టెస్టు పరుగులు నమోదు చేసిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తద్వారా భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్(1105) రికార్డును కోహ్లి చెరిపేశాడు. 2004-05 సీజన్ లో సెహ్వాగ్ ఈ అరుదైన మార్కును చేరగా, దాదాపు 13 ఏళ్ల తరువాత ఆ రికార్డును కోహ్లి బద్ధలు కొట్టాడు. 2016-17 సీజన్లో 15 టెస్టులాడిన కోహ్లీ 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో తొలి స్థానంలో నిలిచాడు.
శుక్రవారం రెండో రోజు ఆటలో కోహ్లి 170 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఒక స్వదేశీ సీజన్ లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన రికార్డును నెలకొల్పాడు. ఇదిలా ఉంచితే, ఈరోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ అత్యంత నిలకడగా ఆడుతోంది. 356/3 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఎటువంటి తడబాటు లేకుండా ఆడుతోంది. కోహ్లి-రహానేల జోడి బంగ్లా బౌలర్లకు పరీక్షగా నిలిచి భారత్ స్కోరును పరుగులు పెట్టిస్తోంది. ఈ జోడి రెండొందలకు పైగా భాగస్వామ్యం సాధించడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.