
పాక్ త్రయం.. కోహ్లి రాగం!
కరాచీ: ఇటీవల కాలంలో తన ఆట తీరుతో ప్రపంచ దిగ్గజాల ప్రశంసల్ని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అందుకుంటున్నా.. పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం కోహ్లిని అభినందించిన ఘటనలు చాలా అరుదు. అయితే ఇప్పుడు ఒకేసారి ముగ్గురు పాక్ దిగ్గజ క్రికెటర్లు కోహ్లిపై ప్రశంసలు వర్షం కురిపించారు. అసలు కోహ్లిని అభినందించడానికి పదాలే లేవంటూ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, సక్లయిన్ ముస్తాక్, షోయబ్ అక్తర్లు ఒకేసారి గళం విప్పారు. విరాట్ కోహ్లి ఆటను పాకిస్తాన్ యువ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలంటూ ఈ దిగ్గజ త్రయం స్పష్టం చేసింది.
'ఒక మంచి ఉత్సాహభరితమైన క్రికెటర్ కోహ్లి. అటు జిమ్లోనూ, ఇటు బయట కూడా విరాట్ కు అతనే సాటి. కఠినమైన శారీరక వ్యాయామం చేస్తూ ఆహార నియమాల్లో అత్యంత నియమంగా ఉండటం విరాట్ కే చెల్లింది. విరాట్ ఫామ్ వెనుక విపరీతమైన కృషి ఉంది'అని సక్లయిన్ పేర్కొన్నాడు.
'విరాట్ కోహ్లితో పాటు భారత యువ ఆటగాళ్లు అత్యుత్తమ ఫామ్లో ఉండటానికి వారు సీనియర్లు సలహాల్ని బాగా వంటబట్టించుకుంటారు. ప్రతీరోజు సునీల్ గవాస్కర్ యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉంటాడు. పాక్ క్రికెట్ జట్టులో అది లేదు. ఏ క్రికెటర్ కూడా సీనియర్ సలహాల్ని తీసుకోడు. దాంతో పాటు మా ఆటగాళ్లు ఫిట్ నెస్పై పెద్దగా శ్రద్ధ పెట్టరు' అని అక్రమ్ పేర్కొన్నాడు.
'ప్రపంచక్రికెట్ లో తనదైన ముద్రతో చెలరేగిపోతున్నవిరాట్ కోహ్లిని పాక్ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలని అక్తర్ పేర్కొన్నాడు. కోహ్లి ఆటను వర్ణంచడానికి పదాలే సరిపోవడం లేదని అక్తర్ తెలిపాడు.