
కలిసి కొట్టారు
► జాదవ్, కోహ్లి సెంచరీలు
► 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్
► 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పరాజయం
► వన్డే సిరీస్‌లో 1–0 ఆధిక్యం
లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి ఎదురుగా ఉండగా, అతడిని మించి ఆడటం మరో బ్యాట్స్‌మన్‌కు సాధ్యమా? కోహ్లి తర్వాత వచ్చి అతనికంటే వేగంగా పరుగులు చేసి అతడిని దాటేయడం మరొకరి వల్ల జరిగే పనేనా? కానీ కేదార్ జాదవ్ దీనిని చేసి చూపించాడు. తనకు అందివచ్చిన అతి స్వల్ప అవకాశాల్లోనే తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న జాదవ్, ఇప్పుడు కెరీర్‌ను మలుపు తిప్పే చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 200 పరుగుల భాగస్వామ్యంలో కోహ్లి 80 బంతుల్లో 95 పరుగులు చేస్తే... మరోవైపు జాదవ్ 67 బంతుల్లోనే 102 పరుగులు బాదేశాడు. బాధ్యత పెరిగినా అది భారం కాదని నిరూపిస్తూ కోహ్లి తనదైన రీతిలో ఛేదనలో మరో సెంచరీతో చెలరేగితే... సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లో జాదవ్ మరాఠీ మాయను చూపించాడు.
63 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. 351 పరుగుల ఛేదనలో ఇది మంచి ఆరంభం మాత్రం కాదు. కోహ్లి క్రీజ్‌లో ఉన్నా, మరో ఎండ్‌లో సహకరించే భాగస్వామి అవసరమయ్యాడు. ఆ బాధ్యత కేదార్ తీసుకున్నాడు. కండరాలు పట్టేయడంతో ఇబ్బందిగా కదిలినా కెప్టెన్‌కు అండగా నిలిచాడు. టి20 తరహాలో వీరిద్దరు ఏకంగా 8.16 రన్‌రేట్‌తో పాతిక ఓవర్ల పాటు ఆగకుండా పరుగులు బాదడం ఇంగ్లండ్‌ను నివ్వెరపోయేలా చేసింది. ఫలితంగా అసాధ్యం అనుకున్న చోట కూడా 11 బంతులు మిగిలి ఉండగానే గెలుపు దక్కించుకున్న భారత్ సగర్వంగా నిలబడింది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో దక్కిన అద్భుత విజయం కోహ్లి మోముపై చిరునవ్వులు పూయించింది.
పుణే: టెస్టు సిరీస్‌లో ఘన విజయం తర్వాత ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ కోహ్లి సేన శుభారంభం చేసింది. భారీ స్కోరును ఛేదించి తన స్థాయికి తగ్గ ఆటతీరును మరోసారి ప్రదర్శించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు సాధించింది. జో రూట్ (95 బంతుల్లో 78; 4 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (61 బంతుల్లో 73; 12 ఫోర్లు), స్టోక్స్ (40 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 48.1 ఓవర్లలో 7 వికెట్లకు 356 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేదార్ జాదవ్ (76 బంతుల్లో 120; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (105 బంతుల్లో 122; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1–0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఈ నెల 19న (గురువారం) కటక్‌లో జరుగుతుంది.
కీలక భాగస్వామ్యాలు...
తొలి పది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 67 పరుగులు... ఇందులో జేసన్ రాయ్ చేసినవే 52 ఉన్నాయంటే అతను ఎంత దూకుడుగా ఆడాడో అర్థమవుతుంది. బుమ్రా విసిరిన డైరెక్ట్ త్రోకు హేల్స్ (9) ఆరంభంలోనే రనౌటైనా... రాయ్ చెలరేగడంతో ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. ముఖ్యంగా పేసర్ ఉమేశ్ బౌలింగ్‌లో చెలరేగిపోయిన అతను 6 బౌండరీలు బాదాడు. 18 పరుగుల వద్ద అంపైర్ ఎల్బీగా అవుట్ ఇచ్చినా... రివ్యూకు వెళ్లిన రాయ్ బతికిపోయాడు. బుమ్రా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు జడేజా బౌలింగ్‌లో రాయ్ స్టంపౌట్ కావడంతో 69 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రూట్, మోర్గాన్ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును నడిపించారు. తనదైన శైలిలో కళాత్మక షాట్లతో ఆకట్టుకున్న రూట్ 72 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మోర్గాన్ వెనుదిరిగిన తర్వాత రూట్, బట్లర్ (36 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు) మధ్య కూడా మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో మరో భారీషాట్‌కు ప్రయత్నించి రూట్ నిష్క్రమించాడు. 42 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 245. అంతే... తర్వాతి ఎనిమిది ఓవర్ల పాటు ఇంగ్లండ్ విధ్వంసం కొనసాగింది. ముఖ్యంగా స్టోక్స్ భారీ సిక్సర్లతో చెలరేగిపోవడంతో పరుగుల వరద పారింది. అతనికి మొయిన్ అలీ (17 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. బుమ్రా వేసిన ఒక ఓవర్లో 16 పరుగులు రాగా, ఉమేశ్ వేసిన ఓవర్లో ఇంగ్లండ్ 20 పరుగులు పిండుకుంది. ఆఖరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 105 పరుగులు చేసింది.
కోహ్లి, జాదవ్ జుగల్‌బందీ...
భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు మెరుగైన ఆరంభం లభించలేదు. విల్లీ తన వరుస ఓవర్లలో ధావన్ (1), లోకేశ్ రాహుల్ (8)లను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ తీశాడు. వచ్చీ రాగానే భారీ సిక్సర్ బాదిన యువరాజ్ సింగ్ (15) ఎక్కువ సేపు నిలబడలేకపోగా, కోహ్లి కెప్టెన్సీలో తొలి మ్యాచ్ ఆడుతున్న ధోని (6) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో జత కలిసిన కోహ్లి, జాదవ్ అద్భుత భాగస్వామ్యంతో చెలరేగారు. చూస్తుండగానే కోహ్లిని దాటిపోయిన జాదవ్, 29 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి జోడీని అడ్డుకునేందుకు ఇంగ్లండ్ ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. ఇద్దరి జోరు కొనసాగడంతో భారత్ వేగంగా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ఈ క్రమంలో ముందుగా కోహ్లి 93 బంతుల్లో (కెరీర్‌లో 27వ), ఆ తర్వాత జాదవ్ 65 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఒత్తిడికి లోను కాకుండా హార్దిక్ పాండ్యా (37 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.
►17 ఛేదనలో చేసిన సెంచరీల సంఖ్యలో సచిన్ (17)తో కోహ్లి సమంగా నిలిచాడు. వీటిలో 15 సార్లు భారత్ గెలిచింది.
ఈ విషయంలో అతను సచిన్ (14)ను అధిగమించాడు.
► 3 భారత్ 350కి పైగా పరుగులు ఛేదించడం ఇది మూడోసారి.మూడు సందర్భాల్లోనూ కోహ్లి సెంచరీ చేశాడు.
► 1 భారత్‌లో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో డీఆర్‌ఎస్ ఉపయోగించడం ఇదే తొలిసారి.