సచిన్ రికార్డు మిస్సయ్యింది!
ఇండోర్: న్యూజిలాండ్ తో మూడో టెస్టులో కెప్టెన్ గా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాట్ కోహ్లి మరో ఘనతను తృటిలో కోల్పోయాడు. న్యూజిలాండ్ జట్టుపై అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన కెప్టెన్గా నిలిచే అవకాశాన్ని కోహ్లి ఏడు పరుగుల వ్యవధిలో చేజార్చుకున్నాడు. అంతకుముందు 1999వ సంవత్సరంలో న్యూజిలాండ్ పై సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 217 పరుగులు సాధించాడు. ఇదే ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత పరుగుల కెప్టెన్సీ రికార్డు. అయితే ఈ రికార్డును విరాట్ సాధిస్తాడని తొలుత భావించినా 211 పరుగుల వద్ద అవుట్ కావడంతో దాన్ని చేరుకోలేకపోయాడు. న్యూజిలాండ్ పై అత్యధిక స్కోర్లు సాధించిన కెప్టెన్లలో సచిన్ ముందుండగా, ఆ తరువాత విరాట్ ఉన్నాడు. ఆపై అలెన్ బోర్డర్(205), హనీఫ్ మహ్మద్(203*), క్రిస్ గేల్ (197) లు ఉన్నారు.
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి విశేషంగా రాణించడంతో భారత తరపున అత్యధిక సెంచరీలు సాధించిన నాల్గో కెప్టెన్ గా నిలిచాడు. తొలి రోజు ఆటలో కోహ్లి శతకం సాధించడంతో అతని కెరీర్ లో 13వ టెస్టు సెంచరీ చేరింది. కాగా, భారత టెస్టు కెప్టెన్ గా ఆరో సెంచరీ. దాంతో టైగర్ పటౌడీ ఐదు సెంచరీల కెప్టెన్సీ రికార్డు ను అధిగమించిన కోహ్లి.. మరో ఆరు సెంచరీలు చేస్తే సునీల్ గవాస్కర్ అత్యధిక కెప్టెన్సీ సెంచరీల రికార్డును అధిగమిస్తాడు. ఇదిలా ఉండగా, ఆ తరువాత డబుల్ సెంచరీ సాధించి ఆ ఘనతను రెండు సార్లు సాధించిన ఏకైక భారత కెప్టెన్గా కోహ్లి నిలిచాడు.