అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్దతి (డీఆర్‌ఎస్)ని బీసీసీఐ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నా.. దీని గురించి జట్టు సభ్యులతో చర్చించేందుకు
టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య
ఫతుల్లా: అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్దతి (డీఆర్‌ఎస్)ని బీసీసీఐ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నా.. దీని గురించి జట్టు సభ్యులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. గతంలో కెప్టెన్‌గా ఉన్న ధోని ఈ పద్దతిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. డీఆర్‌ఎస్ వల్ల నిర్ణయాలు వంద శాతం సరిగా రావని, ఇంకా నవీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడేవాడు. అయితే కోహ్లి మాత్రం కనీసం ఆ పద్దతిపై చర్చ జరగాలని అంటున్నాడు. ‘డీఆర్‌ఎస్ గురించి మనమంతా కూర్చుని విశ్లేషించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా దీనిపై బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సి ఉంది.
అయితే ఈ చర్చ మాత్రం కచ్చితంగా మా మధ్య ఉంటుందనే అనుకుంటున్నాను’ అని కోహ్లి అన్నాడు. ఇప్పటిదాకా భారత్ మినహా అన్ని టెస్టు దేశాలు ఈ డీఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నాయి. అయితే నిర్భందంగా కాకుండా ద్వైపాక్షిక సిరీస్ జరిగినప్పుడు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరిస్తేనే ఈ పద్దతి అమలవుతోంది. కాబట్టి భారత్ ఆడే ఏ టెస్టు సిరీస్‌లోనూ డీఆర్‌ఎస్ ఉండడం లేదు. మరోవైపు డీఆర్‌ఎస్‌ను ఇష్టానుసారం కాకుండా ప్రతీ జట్టు కచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ గతంలో వ్యాఖ్యానించారు.