పర్యావరణాన్ని కాపాడండి: కోహ్లి
న్యూఢిల్లీ: పర్యావరణాన్ని కాపాడేందుకు భారత ప్రజలు ముఖ్యంగా యువత ముందుకు రావాలని టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పిలుపునిచ్చాడు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి పతిజ్ఞ చేయాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశ రాజధానిలో పర్యావరణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెజ్లర్ సుశీల్ కుమార్‌తో కలసి కోహ్లి పాల్గొన్నాడు.
మంత్రి ప్రకాశ్ జవదేకర్, కోహ్లి, సుశీల్‌లు ఇందిర పర్యావరణ్ భవన్ వద్ద మొక్కలు నాటి ‘‘సేవ్ ఎన్విరాన్‌మెంట్ (పర్యావరణాన్ని కాపాడండి)’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక మంచి కార్యక్రమాన్ని తమతో ప్రారంభించినందుకు కోహ్లి, సుశీల్‌లు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యువ ఆటగాడు అజింక్య రహానేలు ముంబయిలో, ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్‌లు వడోదరలో మొక్కలు నాటి కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.