
జోహన్నెస్‌బర్గ్: భారత క్రికెట్ జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్న పేసర్లు భువనేశ్వర్ కుమార్, బూమ్రాలకు సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఇవ్వకపోవడంపై దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తమ జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్లాగ్ ఓవర్లలో బూమ‍్రా, భువీలకు భారత కెప్టెన్ కోహ్లి బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో తనకు అర్ధం కాలేదన్నాడు. వీరిని పక్కకు పెట్టి స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌లు చేత డెత్ ఓవర్లు వేయించడంతో ఆశ్చర్యపోయానన్నాడు. 'నన్ను కోహ్లి కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేశాడు. భారత జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్టులుగా బూమ్రా, భువనేశ్వర్‌లు అందుబాటులో ఉన్నారు. మరి అటువంటప్పుడు చివరి ఓవర్లలో వారిని దూరంగా పెట్టి స్పిన్ ద్వయం చేత ఎందుకు బౌలింగ్ చేయించినట్లు. భారత పేసర్లతో ఆఖర్లో కనీసం రెండేసి ఓవర్లు వేయిస్తారని మిల్లర్-నేను అనుకున్నాం. కానీ అందుకు భిన్నంగా స్పిన్నర్ల చేత కోహ్లి బౌలింగ్ చేయించి ఆశ్చర్యపరిచాడు.
ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ స్పిన్నర్లని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాం. కానీ సిరీస్ ఆరంభంలో ఉన్న పరిస్థితులు ఇప‍్పుడు లేవు. మేము పూర్తిగా స్పిన్ ఎదుర్కొనడానికి కసరత్తులు చేశామని చెప్పను. గత మూడు రోజుల నుంచి కుల్దీప్ బౌలింగ్‌పై బాగా హోమ్‌వర్క్ చేశాం. చైనామన్ బౌలర్(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్) కుల్దీప్‌ను ఆడటానికే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. దాంతో అతన్ని తిప్పికొట్టడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేశాం' అని క్లాసెన్ పేర్కొన్నాడు. డీకాక్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కాస్లెన్ 27 బంతుల్లో 47 పరుగులు చేసి సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాల్గో వన్డేలో కుల్దీప్-చాహల్‌లు 11.3 ఓవర్లు బౌలింగ్ వేసి 119 పరుగులిచ్చారు. అదే సమయంలో మూడు వికెట్లను మాత్రమే సాధించారు.