చివర్లో చేతులెత్తేశారు | virat Kohli's ton in vain, India lose to New Zealand by 24 runs in 1st ODI | Sakshi
Sakshi News home page

చివర్లో చేతులెత్తేశారు

Published Mon, Jan 20 2014 2:06 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

చివర్లో చేతులెత్తేశారు - Sakshi

చివర్లో చేతులెత్తేశారు

వన్డే ప్రపంచకప్‌కు తొలి సన్నాహకంగా మొదలుపెట్టిన న్యూజిలాండ్ పర్యటనలో భారత్ శుభారంభం చేయలేకపోయింది. బౌలర్లు ఫర్వాలేదనిపించినా... కోహ్లి, ధోని, శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చడంతో ఓటమి తప్పలేదు. సమష్టిగా రాణించిన కివీస్ తొలి వన్డేలో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని సంపాదించింది.
 
 నేపియర్: ఓపెనర్లు శుభారంభం అందించకపోవడం... మధ్యలో విరాట్ కోహ్లి (111 బంతుల్లో 123; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (46 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ల దూకుడు... చివర్లో లోయర్ ఆర్డర్ నిరాశ... స్థూలంగా చెప్పాలంటే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆటతీరు ఇది.
 
 
  బౌన్సీ పిచ్‌లపై అనుభవాన్ని కూడగట్టుకోవాలనుకున్న కుర్రాళ్లు ఒక్కొక్కరే పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. దీంతో మెక్‌లారెన్ పార్క్‌లో ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 24 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 292 పరుగులు చేసింది.
 
 
 విలియమ్సన్ (88 బంతుల్లో 71; 7 ఫోర్లు), రాస్ టేలర్ (82 బంతుల్లో 55; 1 ఫోర్), అండర్సన్ (40 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.4 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటై ఓడింది. కోహ్లి ఒంటరిపోరాటం చేయగా, ధోని, ధావన్ (46 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అర్ధ సెంచరీ చేయడంతోపాటు రెండు కీలక వికెట్లు తీసిన అండర్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే హామిల్టన్‌లో బుధవారం జరుగుతుంది.
 
 అండర్సన్ అదుర్స్
 ఆరంభంలో వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డా... విలియమ్సన్, టేలర్ సమయోచితంగా ఆడారు. భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించి స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. తర్వాత వచ్చిన మెకల్లమ్ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. కానీ అండర్సన్, రోంచీ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ల బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. స్లాగ్ ఓవర్లలో భారత బౌలర్ల దుమ్ము దులుపుతూ భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఇషాంత్ బౌలింగ్‌లో రెండు, అశ్విన్, షమీ చెరో సిక్సర్‌ను కొట్టిన అండర్సన్ చివరి వరకు అదే దూకుడును కనబర్చాడు. రోంచీ కూడా జడేజా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు సాధించాడు. వీరిద్దరు 37 బంతుల్లోనే 66 పరుగులు జోడించారు. షమీ 4 వికెట్లు తీశాడు.
 
 ఒంటరిపోరాటం
 కివీస్ తరహాలోనే భారత్ ఇన్నింగ్స్ మొదలైనా... మిడిలార్డర్ విఫలం కావడం దెబ్బతీసింది. కోహ్లి ఒక్కడే ఇన్నింగ్స్ ఆసాంతం ఒంటరిపోరాటం చేశాడు. ఓ ఎండ్‌లో సహచరులు రహానే (7), రైనా (18) వెనుదిరిగినా... తడబడకుండా ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ధోనితో కలిసి కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో పేసర్ల బౌలింగ్‌లో వీలైనన్ని బౌండరీలు కొట్టాడు.
 
  నాథన్ మెకల్లమ్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు సంధించాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌతీ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిన భారీ షాట్‌ను రైడర్ సరిగా అంచనా వేయలేక అందుకోలేకపోయాడు. తర్వాతి బంతినే బౌండరీకి తరలించిన ఈ ఢిల్లీ ప్లేయర్ కెరీర్‌లో 18వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ధోని... అండర్సన్, నాథన్‌కు రెండు మెరుపు సిక్సర్ల రుచి చూపెట్టాడు. ఐదో వికెట్‌కు కోహ్లితో కలిసి 95 పరుగులు జోడించిన కెప్టెన్ వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. మెక్లీనగన్ 4, అండర్సన్ 2 వికెట్లు తీశారు.
 
 టర్నింగ్ పాయింట్
 ఓ దశలో భారత్ విజయ లక్ష్యం 48 బంతుల్లో 70 పరుగులు... కోహ్లి, ధోని నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరి బ్యాటింగ్‌తో భారత్ కచ్చితంగా గెలుస్తుందనే భావించారు. కానీ మెక్లీనగన్ ఆరు బంతుల తేడాలో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను కివీస్ వైపు తిప్పాడు. 43వ ఓవర్ మూడో బంతికి ధోనిని, ఆరో బంతికి జడేజాను... 45వ  ఓవర్‌లో రెండో బంతికి కోహ్లిని మెక్లీనగన్ పెవిలియన్‌కు పంపడంతో భారత్ కోలుకోలేకపోయింది. పెరుగుతున్న రన్‌రేట్‌కు అనుగుణంగా లోయర్ ఆర్డర్‌లో ఎవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు.
 
 నిలకడ కావాలి
 ‘స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. నేను, జడేజా, కోహ్లిలో ఒక్కరం ఉన్నా పరిస్థితి వేరేగా ఉండేది. చివర్లో వేగంగా పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ దానిని సాధించలేకపోయాం. మా బ్యాటింగ్‌లో ఇంకా నిలకడ రావాలి. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చే బ్యాట్స్‌మెన్ వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలి.’      
 -ధోని (భారత కెప్టెన్)
 
 ధోని రికార్డు
 వన్డేల్లో 300 క్యాచ్‌లు అందుకున్న భారత తొలి వికెట్ కీపర్‌గా ధోని కొత్త రికార్డు సృష్టించాడు. కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. అతను 239 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని సాధించాడు.
 
 స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్టిల్ (సి) అశ్విన్ (బి) షమీ 8; రైడర్ (బి) షమీ 18; విలియమ్సన్ (సి) రహానే (బి) జడేజా 71; టేలర్ (సి) ధోని (బి) షమీ 55; బ్రెండన్ మెకల్లమ్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 30; అండర్సన్ నాటౌట్ 68; రోంచీ (సి) భువనేశ్వర్ (బి) ఇషాంత్ 30; నాథన్ మెకల్లమ్ (సి) అండ్ (బి) షమీ 2; సౌతీ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 292
 వికెట్ల పతనం: 1-22; 2-32; 3-153; 4-171; 5-213; 6-279; 7-284
 బౌలింగ్: భువనేశ్వర్ 10-0-38-1; షమీ 9-0-55-4; ఇషాంత్ 9-0-72-1; జడేజా 9-0-61-1; అశ్విన్ 10-0-52-0; కోహ్లి 3-0-13-0.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సౌతీ (బి) మెక్లీనగన్ 3; ధావన్ (సి) టేలర్ (బి) అండర్సన్ 32; కోహ్లి (సి) రైడర్ (బి) మెక్లీనగన్ 123; రహానే (సి) నాథన్ మెకల్లమ్ (బి) అండర్సన్ 7; రైనా (సి) సౌతీ (బి) మిల్న్ 18; ధోని (సి) రోంచీ (బి) మెక్లీనగన్ 40; జడేజా (సి) రోంచీ (బి) మెక్లీనగన్ 0; అశ్విన్ (సి) సౌతీ (బి) విలియమ్సన్ 12; భువనేశ్వర్ రనౌట్ 6; ఇషాంత్ (బి) సౌతీ 5; షమీ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (48.4 ఓవర్లలో ఆలౌట్) 268
 వికెట్లపతనం: 1-15; 2-73; 3-84; 4-129; 5-224; 6-224; 7-237; 8-244; 9-259; 10-268
 బౌలింగ్: సౌతీ 9.4-2-43-1; మెక్లీనగన్ 10-0-68-4; మిల్న్ 7.3-0-40-1; అండర్సన్ 10-0-51-2; నాథన్ మెకల్లమ్ 10-0-54-0; విలియమ్సన్ 1.3-0-9-1.
 
 1 ఛేజింగ్‌లో కోహ్లి సెంచరీ చేసినప్పుడు భారత్ ఓడటం ఇదే తొలిసారి. 12 సార్లు సెంచరీ చేస్తే 11 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement