వీరుడొక్కడు చాలు...
ఎంత కొట్టామన్నది కాదు, ఎంత వేగంతో కొట్టామన్నది ముఖ్యం... సెహ్వాగ్‌కు మాత్రమే సరిపోయే డైలాగ్ ఇది.
సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీని అందుకోవడం ఎలా ఉంటుంది... వీరూకి మాత్రమే తెలిసిన మజా.
టెస్టు ఓపెనర్ అంటే వికెట్ కాపాడుకోవడం కాదు...
వీర విధ్వంసం సృష్టించడం ఎలాగో సెహ్వాగ్ మాత్రమే చూపించిన విద్య.
ఒకటా, రెండా ఎన్నో అద్భుతాలు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ నుంచి జాలువారాయి. సచిన్ అంతటివాడిని కావాలని క్రికెట్‌లోకి వచ్చిన సెహ్వాగ్ ఒక దశలో మాస్టర్‌నే మించిపోయాడు. దూకుడు అంటూ ఇప్పుడు కొందరు వల్లె వేయవచ్చు గాక... కానీ అసలు దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మైదానంలో నేర్పించిన ఘనత సెహ్వాగ్‌దే. అతను క్రీజ్‌లో ఉన్నంతసేపు ఎంతటి భారీ లక్ష్యమైనా చిన్నదిగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బంతిని బౌండరీ దాటించడంపైనే దృష్టి పెట్టే ఈ ‘నజఫ్‌గఢ్ నవాబ్’కు ఫుట్‌వర్క్, సాంప్రదాయ షాట్లు లాంటివి పట్టవు.
ఎవరైనా దానిని గుర్తు చేసినా అతను పట్టించుకోడు! తక్కువ శ్రమ-ఎక్కువ ఫలితం అనే సిద్ధాంతంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే శైలి అతడిని స్టార్‌ను చేసింది. భారత్‌కు అరుదైన, అనూహ్య విజయాలు అందించింది. సాధారణంగా టెస్టుల్లో ఒక రోజు ఆటంతా ఆడితే జట్టు మొత్తం చేయగలిగే స్కోరు 284. కానీ సెహ్వాగ్ ఒక్కడే దీనిని ఒక్కరోజులో కొట్టి పడేశాడు.
భారత్ టెస్టుల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ బ్యాట్స్‌మన్‌కూ అందని ‘ట్రిపుల్ సెంచరీ’ అతను పాకిస్తాన్ గడ్డపై సాధించిన రోజున గర్వించని భారతీయుడు లేడు. మరో నాలుగేళ్లకు మరో ‘ట్రిపుల్’ను బాది ఎవరికీ అందని ఎత్తులో నిలిచిన అతను వన్డేల్లోనూ ‘డబుల్’తో తన విలువను చూపించాడు. టెస్టుల్లో ఊహించడానికే సాధ్యం కాని 82 స్ట్రయిక్‌రేట్ అతనికే చెల్లింది. వీరేంద్ర సెహ్వాగ్ అనగానే అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయిన కొన్ని ఇన్నింగ్స్‌లను చూస్తే....
టెస్టులు
* 2003 (మెల్‌బోర్న్): ఆస్ట్రేలియాపై ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఐదు గంటల్లోనే 195 పరుగుల ఇన్నింగ్స్.
* 2004 (ముల్తాన్): భారత్ తరఫున తొలి ‘ట్రిపుల్ సెంచరీ’ (319). సక్లాయిన్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఈ ఘనత.
* 2006 (లాహోర్): ద్రవిడ్‌తో తొలి వికెట్‌కు 410 పరుగుల భాగస్వామ్యం. 247 బంతుల్లో 254 (47 ఫోర్లు).
* 2008 (అడిలైడ్): ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులతో భారత్‌కు తప్పిన ఓటమి.
* 2008 (చెన్నై): 278 బంతుల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు (దక్షిణాఫ్రికాపై).
* 2009 (ముంబై): మూడో ‘ట్రిపుల్ సెంచరీ’ మిస్. శ్రీలంకపై 254 బంతుల్లో 293.
* 2010 (కోల్‌కతా): 174 బంతుల్లో 165. టెస్టుల్లో నంబర్‌వన్‌గా సెహ్వాగ్.
వన్డేలు
* 2001 (కొలంబో): సచిన్ గైర్హాజరులో వన్డేల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. 69 బంతుల్లో సెంచరీ...సెహ్వాగ్ స్టయిల్ బయటపడింది.
* 2002 (కొలంబో): చాంపియన్స్ ట్రోఫీ సెమీస్. ఇంగ్లండ్‌పై 77 బంతుల్లో సెంచరీతో భారత్ ఫైనల్‌కు.
* 2009 (హామిల్టన్): 60 బంతుల్లో సెంచరీతో భారత్ తరఫన కొత్త రికార్డు.
* 2009 (రాజ్‌కోట్): 102 బంతుల్లో 146 పరుగులతో 414 పరుగుల జట్టు రికార్డు స్కోరులో కీలకపాత్ర.
* 2011 (ఇండోర్): 140 బంతుల్లో వన్డేల్లో డబుల్ సెంచరీ.